Maharashtra Crisis: మహారాష్ట్ర రాజకీయాల్లో బిగ్‌ ట్విస్ట్‌..!

గత రెండురోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎంవీఏ సంకీర్ణ కూటమి పతనం అంచులకు చేరుకుంది.

Updated : 23 Jun 2022 16:19 IST

ముంబయి: గత రెండు రోజులుగా మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠ రేపుతున్నాయి. గంటగంటకు అనూహ్య పరిణామాలతో సంకీర్ణ ప్రభుత్వం పతనం అంచులకు చేరుకుంది. ఈ నేపథ్యంలో శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ అసమ్మతి నేతలకు సరికొత్త ఆఫర్ ఇచ్చారు. 24 గంటల్లో వారంతా ముంబయికి తిరిగి వచ్చేస్తే.. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) నుంచి శివసేన బయటకు వచ్చే అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. 

ప్రస్తుతం శివసేన అసమ్మతి నేత ఏక్‌నాథ్ శిందే నాయకత్వంలో 40 మందికి పైగా ఎమ్మెల్యేలు అస్సాంలోని గువాహటిలో ఉన్నారు. వారంతా తొలిసారి మీడియా ముందుకు వచ్చి బలప్రదర్శన నిర్వహించారు. తనకు శివసేన ఎమ్మెల్యేలతో పాటు స్వతంత్రుల మద్దతు కూడా ఉందని శిందే వెల్లడించారు. మరోపక్క ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నిర్వహించిన సమావేశానికి ఆదిత్య ఠాక్రే సహా 13 మంది ఎమ్మెల్యేలు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది. మొత్తం ఆ పార్టీకి 55 మంది అసెంబ్లీ సభ్యులుండగా.. 13 మందే హాజరుకావడం చూస్తుంటే.. పార్టీలో చీలిక ఖాయంగా కనిపిస్తోంది. ఈ తరుణంలో సంజయ్‌ రౌత్‌ చేసిన ఆఫర్‌ మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ట్విస్ట్‌గా మారింది. 

‘‘మేం శివసైనికులం’ అని మీరు చెబుతున్నారు. పార్టీని వీడమంటున్నారు. ముంబయి వెలుపల ఉన్న ఈ అసమ్మతి నేతలు హిందుత్వ అంశాన్ని లేవనెత్తారు. మీకు ప్రభుత్వంతోనే సమస్యలున్నాయంటున్నారు. ఈ ఎమ్మెల్యేలంతా శివసేన పార్టీ ఎంవీఏ నుంచి బయటకు రావాలని కోరుకుంటే.. ముంబయికి వచ్చే ధైర్యం చేయండి. 24 గంటల్లో మీరు ముంబయికి తిరిగి వచ్చి, సీఎం ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చిస్తే.. మీ డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోవడానికి మేం సిద్ధంగా ఉన్నాం. మీ డిమాండ్‌ను సానుకూలంగా తీసుకుంటాం. ట్విటర్, వాట్సాప్‌లో లేఖలు రాయకండి’ అంటూ రౌత్ సూచించారు. 

నిన్న ఉద్ధవ్ ఠాక్రే కార్యకర్తలతో మాట్లాడుతూ.. తాను ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడానికి సిద్ధమేనని ప్రకటించారు. అలాగే తన రాజీనామా లేఖ సిద్ధంగా ఉందని కూడా చెప్పారు. ఆ వెంటనే అధికారిక నివాసాన్ని కూడా ఖాళీ చేశారు. ఇదిలాఉంటే.. ప్రస్తుత మహారాష్ట్ర ప్రభుత్వంలో ఎన్‌సీపీ, కాంగ్రెస్‌, శివసేన భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని