Shiv Sena: రాహుల్‌ను టార్గెట్ చేసిన శివసేన

కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను శివసేన పార్టీ తప్పుపట్టింది. రాహుల్ కేవలం ట్విటర్‌లో మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది

Published : 25 Jun 2021 01:12 IST

‘ట్విటర్‌లోనే ఆయన మాటలన్నీ..’ అంటూ వ్యాఖ్య

దిల్లీ: కరోనా వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన విమర్శలను శివసేన పార్టీ తప్పుపట్టింది. రాహుల్ కేవలం ట్విటర్‌లో మాత్రమే తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారని, విపక్షాలను ఏకతాటిపైకి తీసుకురావడంలో విఫలమయ్యారని వ్యాఖ్యానించింది. అలాగే ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ నేతృత్వంలో దిల్లీలో జరిగిన సమావేశం గురించి శివసేన ప్రస్తావించి, ప్రశంసించింది. మంగళవారం జరిగిన రాష్ట్రమంచ్ సమావేశానికి పవార్ అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమావేశానికి కాంగ్రెస్‌, శివసేన తరఫు నుంచి నేతలు హాజరుకాలేదు. 

ప్రస్తుతం దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై తాజాగా శివసేన పార్టీ పత్రిక సామ్నాలో తన అభిప్రాయాలను వెల్లడించింది. ‘ప్రధాని నరేంద్రమోదీ బాడీ లాంగ్వేజ్ మారినట్లు కనిపిస్తోంది. దేశంలో నెలకొన్న పరిస్థితులు ఏమంత మెరుగ్గా లేవని స్పష్టమవుతోంది. ప్రజల్లో ఆగ్రహం, అసంతృప్తి నెలకొని ఉన్నప్పటికీ.. తమ ప్రభుత్వానికి ఢోకా లేదని భాజపాకు గట్టి నమ్మకం ఉంది. బలహీన ప్రతిపక్షమే ఆ విశ్వాసానికి కారణం’ అని రాసుకొచ్చింది. 

‘కాంగ్రెస్ పార్టీ రాష్ట్రమంచ్‌ సమావేశాన్ని పెద్దగా పట్టించుకోలేదు. పవార్‌లాగే రాహుల్ కూడా విపక్ష పార్టీలను ఒకదగ్గరకు చేర్చే ప్రయత్నం చేస్తే.. ప్రతిపక్షం మరింత బలంగా కనిపించేంది. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వానికి మునుపటి ఆదరణ లేదు. ఆ పార్టీ ప్రభావం కోల్పోయిన దగ్గర ప్రతిపక్షాలు పుంజుకునే ప్రయత్నం చేయడం లేదు’ అని అసంతృప్తి వ్యక్తం చేసింది. మరోపక్క శరద్ పవార్ ప్రయత్నాలను కొనియాడుతూనే.. నాయకత్వ ప్రశ్నను లేవనెత్తింది. ఈ విషయంలో కాంగ్రెస్‌ చొరవ తీసుకుని ముందుకు వెళ్తుందేమో అనుకుందామంటే.. చాలా నెలలుగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు లేకుండానే కార్యకలాపాలు నిర్వహిస్తోందని గుర్తుచేసింది. పవార్ ప్రయత్నాలకు రాహుల్ వంటి నేత జతకలిస్తే.. ప్రతిపక్షానికి మరింత బలం చేకూరుతుందని తెలిపింది. ‘రాహుల్ గాంధీ ప్రధాని మోదీ అవలంబిస్తోన్న విధానాలపై దాడి చేస్తున్నారనే మాట నిజం. కానీ అదంతా ట్విటర్‌లోనే. ట్విటర్ తమకు అనుకూలంగా పనిచేయడం లేదని గ్రహించిన వెంటనే.. చర్యలు తీసుకోవడం ప్రారంభించారు’ అని వ్యాఖ్యలు చేసింది.

కొద్ది రోజుల క్రితం మహారాష్ట్ర కాంగ్రెస్‌ చీఫ్‌పై విమర్శలు చేసిన శివసేన.. ఈసారి ఏకంగా రాహుల్ గాంధీనే టార్గెట్ చేసింది. దీనిపై కాంగ్రెస్ ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వంలో కాంగ్రెస్ కూడా భాగమేనన్న సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని