భాజపా మాజీ ఎంపీ కిరీట్‌ సోమయ్య కారుపై దాడి

భాజపా మాజీ ఎంపీ కిరీట్‌ సోమయ్య కారుపై ముంబయిలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే రాళ్ల దాడి జరగడం కలకలం సృష్టించింది. ఇందులో ఆయన ముఖానికి గాయమై...

Updated : 24 Apr 2022 23:06 IST

 శివసేన గూండాల పనేనన్న నేత  

ముంబయి: భాజపా మాజీ ఎంపీ కిరీట్‌ సోమయ్య కారుపై ముంబయిలో పోలీస్‌ స్టేషన్‌ ఎదుటే రాళ్ల దాడి జరగడం కలకలం సృష్టించింది. ఇందులో ఆయన ముఖానికి గాయమై రక్తం కారడంతోపాటు కారు అద్దం ధ్వంసమైంది. ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వ అండదండలతో శివసేన గూండాలు తనను చంపడానికి ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని సోమయ్య ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఆదివారం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు సోమయ్య కారు డ్రైవరు వాహనాన్ని నిర్లక్ష్యంగా నడపడంతో తమ పార్టీ కార్యకర్తలు ఇద్దరు గాయపడ్డారని శివసేన నేతలు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేశారు. శనివారం ఎంపీ నవనీత్‌ రాణా, ఎమ్మెల్యే రవి రాణా దంపతులను పోలీసులు అరెస్టు చేసి ఖర్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించడంతో సోమయ్య అక్కడకు వెళ్లారు. అప్పటికే అక్కడ గుమికూడిన శివసేన కార్యకర్తలు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమయ్య స్టేషన్‌ నుంచి తిరిగివెళ్తున్నప్పుడు కారుపై చెప్పులు, రాళ్లు విసిరారు. ఈ ఘటనలో గాయపడిన ఆయన బాంద్రా పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. పోలీసులు గుర్తు తెలియని వ్యక్తిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అయితే అందులో తక్కువ తీవ్రత ఉండే సెక్షన్లు పెట్టారంటూ సోమయ్య ఎఫ్‌ఐఆర్‌ కాపీపై సంతకం చేయడానికి నిరాకరించారు. రాష్ట్రంలో శాంతిభద్రతదల పరిస్థితి ఘోరంగా ఉందని, ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని భాజపా సీనియర్‌ నేత దేవేంద్ర ఫడణవీస్‌ ఆదివారం చెప్పారు. రాష్ట్ర ప్రజలు కేంద్ర ప్రభుత్వ పాలనను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు