Ponguleti: ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోవాలా?: మంత్రి పొంగులేటి

కేసీఆర్‌ అంటే నాకు ప్రేమే. ప్రతిపక్ష నేతగా ఆయన తన అనుభవంతో అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని, బడ్జెట్‌ సమావేశాలకు రావాలని మేం కోరుకుంటున్నాం.

Updated : 10 Jul 2024 06:43 IST

కేసీఆర్‌ అంటే నాకు ప్రేమే. ప్రతిపక్ష నేతగా ఆయన తన అనుభవంతో అసెంబ్లీకి వచ్చి సలహాలు, సూచనలు ఇవ్వాలని, బడ్జెట్‌ సమావేశాలకు రావాలని మేం కోరుకుంటున్నాం. గత ప్రభుత్వ పథకాలపై మేమేం భేషజాలకు పోవడం లేదు. మంచివి తీసుకుంటున్నాం. సరిగ్గా లేనివి చక్కదిద్దుతున్నాం. రాష్ట్రానికి మోదీ వస్తే ప్రధానిగానే చూస్తాం. 

మంత్రి పొంగులేటి

ఈనాడు- హైదరాబాద్‌: ‘‘రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక.. సర్కారును కూల్చివేస్తామంటూ భారాస అధినేత కేసీఆర్, ఆ పార్టీ నేతలు పదే పదే చెప్పారు. కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని కూల్చడానికి చాటుమాటుగా దిల్లీలో భాజపా నేతలతో కేసీఆర్‌ మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోతుందని, భారాస అధికారంలోకి వచ్చాక ఎవరెవరికి మంత్రి పదవులు ఇస్తామో కూడా ఆయన చెప్పుకొన్నారు. అలా అంటే చూస్తూ ఊరుకోవాలా? మా ప్రభుత్వాన్ని పటిష్ఠం చేసుకునేందుకే చేరికలు కొనసాగుతున్నాయి. గత శాసనసభలో కేసీఆర్‌ ఎమ్మెల్యేల సంఖ్యాబలాన్ని వందకు పెంచుకున్నట్టుగా మాకూ వంద మంది ఉండాలని అనుకోవడం లేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం పదిలంగా ఉండేందుకు అవసరమైనంత మంది ఎమ్మెల్యేల చేరిక పూర్తయ్యాక వాటిని నిలిపివేస్తాం’’ అని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. 

చేరే వారికి చాలా తలుపులు తెరిచి ఉన్నాయి..

‘‘2018 ఎన్నికల్లో భారాస 88 సీట్లు నెగ్గింది. కాంగ్రెస్‌ 19 సీట్లు గెలిచి ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. భారాస ప్రభుత్వాన్ని కూలుస్తామని అప్పట్లో మేమెప్పుడూ అనలేదు. ప్రభుత్వాన్ని కూల్చడమనే పదమే అప్రజాస్వామికం. అయినప్పటికీ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కేసీఆర్‌ చేర్చుకుని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా.. చివరికి ఆరుగురినే మిగిల్చారు. అప్పట్లో వారు చేసిందే ఇప్పుడు జరుగుతోంటే మమ్మల్ని విమర్శించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంది. మా పార్టీ నేతలను భారాస ఎమ్మెల్యేలు అనేక మార్గాల్లో సంప్రదిస్తూ.. చేరడానికి ముందుకొస్తున్నారు. చేరాలనుకునేవారికి చాలా దర్వాజాలు తెరిచి ఉన్నాయి. 

పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తెస్తాం

గత ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి, రెవెన్యూ చట్టంతో అనేక సమస్యలు తలెత్తాయి. ధరణిలో 33 మాడ్యూళ్లు అవసరమా? ధరణిలో తప్పులను సవరించేందుకు ఇంత సమయం పట్టింది. పెండింగ్‌ సమస్యలను త్వరలో పరిష్కరిస్తాం. ఇప్పుడున్న రెవెన్యూ చట్టంలో అప్పీలు చేసుకునే వెసులుబాటు లేదు. దీన్ని పూర్తిగా సవరించి.. సరళమైన, పటిష్ఠమైన రెవెన్యూ చట్టం తీసుకొస్తాం. 

త్వరలో భూముల క్రమబద్ధీకరణ

త్వరలోనే భూముల క్రమబద్ధీకరణ చేపడతాం. జీవో నం.59 కింద ఇప్పటికే 100 గజాల్లోపు స్థలాల సమస్యలను పరిష్కరిస్తున్నారు. గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇష్టారీతిన కావాల్సిన వారికి ప్రభుత్వ భూములను కట్టబెట్టింది. క్రమబద్ధీకరణలో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ జరిగింది. పేదోడికి చెందాల్సిన ఆస్తి బినామీల పాలైంది. అలాంటివాటి క్రమబద్ధీకరణ నిలిపివేశాం. ధరణి, జీవో నం.59లకు సంబంధించి తిరస్కరణకు గురైన దరఖాస్తుల రుసుం రూ.30 కోట్లు తిరిగి చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

భూముల ధరలు అమాంతంగా పెంచం

ఉమ్మడి రాష్ట్రంలో 2011లో భూముల ధరల సవరణ శాస్త్రీయంగా జరిగింది. 2021-22లో శాస్త్రీయంగా చేయలేదు. ఈసారి శాస్త్రీయంగా భూముల ధరలు సవరించాలని, అమాంతంగా పెంచొద్దని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో సాగు భూములు ఎక్కడా ఎకరా రూ.1.50 లక్షలకు తక్కువగా లేవు. వీటిని కొంతవరకు సవరించే అవకాశాలున్నాయి. ఆగస్టు నుంచి కొత్త విలువలు అమల్లోకి వస్తాయని చెప్పలేం. 

ఇతర రాష్ట్రాల్లో అధ్యయనం తర్వాత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం

రాజీవ్‌ స్వగృహ టవర్స్‌ ధరలపై కమిటీ నివేదిక అనంతరం వేలం వేయడంపై నిర్ణయం తీసుకుంటాం. రెండు పడకగదుల ఇళ్లను పూర్తిచేసి నిరుపేదలకు ఇస్తాం. ఇందిరమ్మ ఇళ్ల నమూనాలపై అధ్యయనానికి ఇతర రాష్ట్రాలకు బృందాలు వెళ్లాయి. అవి నివేదిక ఇవ్వగానే ఏడాదికి 4.50 లక్షల చొప్పున ఇళ్లు నిర్మించి ఇస్తాం. తెల్ల రేషన్‌కార్డుల్లోనూ నకిలీలున్నాయి. చాలామంది హెల్త్‌ కార్డులా వినియోగించుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగా రేషన్‌కు, వైద్యచికిత్సకు వేర్వేరు కార్డులు అందజేస్తాం. దీనిపై సర్వే చేపడతాం. 

చేసింది చెప్పుకోవడంలో వెనుకబడ్డాం  

మా ప్రభుత్వం ఏడు నెలల్లో ఎంతో చేసినా.. చెప్పుకోవడంలో వెనుకబడ్డాం. పరిశ్రమలు రావడం, ఆర్‌ఆర్‌ఆర్‌ విస్తరణతో అభివృద్ధి రేటు పెరిగింది. హైదరాబాద్‌లో కమర్షియల్‌ లీజు ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో అమ్మ ఆదర్శ పాఠశాలలకు రూ.680 కోట్లు ఇచ్చాం. ఒక్క ఫిర్యాదు లేకుండా ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశాం.’’

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని