Karnataka: సిద్ధరామయ్య వద్దే ఆర్థికం.. డీకేకు నీటిపారుదల
Karnataka portfolios: కర్ణాటకలో మంత్రిత్వ శాఖల కేటాయింపులపై అధికారిక ప్రకటన వెలువడింది. అందరూ ఊహించినట్లుగానే సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖను తీసుకున్నారు. తన డిప్యూటీ డీకేకే రెండు కీలక శాఖలను అప్పగించారు.
బెంగళూరు: కర్ణాటక (Karnataka)లో పూర్తి స్థాయి మంత్రి మండలిని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా మంత్రులకు శాఖల (portfolios)ను కేటాయించింది. ఊహాగానాలకు అనుగుణంగానే ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆర్థిక శాఖను తన వద్దే ఉంచుకున్నారు. ఇక పార్టీ ప్రయోజనాల కోసం సీఎం పదవిని త్యాగం చేసి ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టిన డీకే శివకుమార్ (DK Shivakumar)కు నీటిపారుదలతో పాటు, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను అప్పగించారు. ఈ మేరకు మంత్రిత్వ శాఖల కేటాయింపులపై ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత కర్ణాటక సర్కారు ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది.
సీఎం సిద్ధరామయ్య ఆర్థిక శాఖ (Finance Ministry) బాధ్యతలు నిర్వహించి 13 సార్లు రాష్ట్ర బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీంతో ఈసారి కూడా ఆర్థికశాఖను తానే తీసుకున్నారు. దీంతో పాటు కేబినెట్ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్, సమాచార, ఐటీ, మౌలికసదుపాయాల అభివృద్ధి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫామ్స్ వంటి శాఖలను తన వద్దే ఉంచుకున్నారు. ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు భారీ, మధ్యతరహా నీటి పారుదల (Irrigation) శాఖ, బెంగళూరు నగర అభివృద్ధి శాఖలను కేటాయించారు. త్వరలో జరగబోయే బృహత్ బెంగళూరు మహానగర పాలిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని డీకేకే ఆ శాఖను అప్పగించినట్లు తెలుస్తోంది.
ఖర్గే కుమారుడికి గ్రామీణాభివృద్ధి..
గతంలో హోంశాఖను నిర్వర్తించిన మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వరకు ఈసారీ కూడా అదే శాఖ దక్కింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కుమారుడు ప్రియాంక్‌కు గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖలను కేటాయించారు. కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ఏకైక మహిళా మంత్రి లక్ష్మీ హెబ్బాళ్కర్‌కు మహిళా, శిశు సంక్షేమ శాఖ, వృద్ధులు, దివ్యాంగుల సాధికారిత శాఖలను అప్పగించారు. మాజీ సీఎం బంగారప్ప కుమారుడు మధు బంగారప్పకు ప్రాథమిక, ఉన్నత విద్య శాఖను కేటాయించారు.
రామలింగారెడ్డికి రవాణాశాఖను కేటాయించారు. ఈ శాఖపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేయగా.. డీకే శివకుమార్ నిన్న ఆయన నివాసానికి వెళ్లి బుజ్జగించడంతో ఆయన అంగీకరించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇక దినేశ్ గుండురావుకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, కృష్ణ బైరెగౌడకు రెవెన్యూ, సతీశ్ జర్ఖిహోళికి ప్రజా వ్యవహారాలు, హెచ్‌సీ మహదేవప్పకు సామాజిక సంక్షేమ శాఖలను అప్పగించారు.
మే 20వ తేదీన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌తో పాటు మరో ఎనిమిది మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. అనంతరం గత శనివారం మరో 24 మందితో కేబినెట్‌ను విస్తరించారు. దీంతో మొత్తం 34 మందితో పూర్తి స్థాయి మంత్రిమండలి ఏర్పడింది. అయితే, శాఖల కేటాయింపు సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలోనే మంత్రుల శాఖలకు సంబంధించిన ఓ ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అందులో ఉన్న కేటాయింపులపై పలువురు మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అది నిజం కాదని చెప్పిన కాంగ్రెస్ పెద్దలు.. అసంతృప్తులను బుజ్జగించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నిన్న అర్ధరాత్రి దాటాక.. శాఖల కేటాయింపులపై అధికారిక ప్రకటన చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
-
Nani: అప్పుడే మొదటి సారి ప్రేమలో పడ్డా.. ప్రస్తుతం తనే నా క్రష్: నాని
-
Madhapur Drugs Case: నటుడు నవదీప్‌ను ప్రశ్నిస్తున్న నార్కోటిక్స్ పోలీసులు
-
USA: కెనడా-ఇండియా ఉద్రిక్తతలు.. అమెరికా మొగ్గు ఎటువైపో చెప్పిన పెంటాగన్ మాజీ అధికారి
-
Nara Lokesh: జైలు మోహన్‌కు బెయిల్‌డే వార్షికోత్సవ శుభాకాంక్షలు: లోకేశ్
-
TSPSC: తెలంగాణ గ్రూప్ - 1 ప్రిలిమ్స్ రద్దు..