Karnataka CM Post: సిద్ధూ - డీకే.. సీఎం కుర్చీ చెరిసగమేనా..?

కర్ణాటక (Karnataka) నూతన ముఖ్యమంత్రి (Chief Minister) ఎవరనేదానిపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. సీఎం ఎంపికపై కాంగ్రెస్‌ (Congress) హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. దీనిపై మంగళవారం నిర్ణయం వెల్లడించే అవకాశముంది.

Updated : 15 May 2023 12:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Karnataka Assembly elections) ఘన విజయం సాధించిన కాంగ్రెస్‌ (Congress) పార్టీకి.. ముఖ్యమంత్రి ఎంపిక మాత్రం క్లిష్టంగా మారింది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah), పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar) మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో.. తుది నిర్ణయాన్ని అధిష్ఠానానికే వదిలేశారు. దీంతో సీఎం ఎంపిక కోసం పార్టీ హైకమాండ్‌ మల్లగుల్లాలు పడుతోంది. ఈ క్రమంలోనే సీఎం కుర్చీ (CM Post)ని నేతలిద్దరూ చెరిసగం పంచుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

సీఎం కుర్చీని పంచాలనే సలహాను సిద్ధరామయ్యే పార్టీ ముందుంచినట్లు ఏఐసీసీ (AICC) విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. డీకే శివకుమార్‌ (DK Shivakumar)తో కలిసి ముఖ్యమంత్రి పదవిని పంచుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని సిద్ధూ (Siddaramaiah) సూచించినట్లు తెలుస్తోంది. అయితే తొలి రెండున్నరేళ్లు తానే పదవి చేపడతానని, ఆ తర్వాత మిగిలిన పదవీకాలాన్ని డీకేకు ఇస్తానని ఆయన చెప్పినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అయితే, దీనిపై ఏఐసీసీ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం.

బర్త్‌డే గిఫ్ట్‌గా పార్టీ ఏమిస్తుందో..?: డీకే

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ (Congress) విజయంలో కీలక పాత్ర పోషించిన డీకే శివకుమార్‌ (DK Shivakumar) నేడు తన 62వ పుట్టినరోజు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రజలకు సేవ చేసేందుకే నా జీవితాన్ని అంకితం చేశా. కర్ణాటక ప్రజలు కాంగ్రెస్‌ను గెలిపించి ఈ పుట్టినరోజుకు నాకు గొప్ప బహుమతిని అందించారు. ముఖ్యమంత్రిని ఎంపిక చేసే బాధ్యతను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge)కు అప్పగిస్తూ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం ఏకగ్రీవంగా తీర్మానించింది. ఇక పార్టీ హైకమాండ్‌ నా పుట్టినరోజున ఏం గిఫ్ట్‌ ఇస్తుందో తెలియదు’’ అని అన్నారు.

దిల్లీకి సిద్ధూ..

సీఎం అభ్యర్థి ఎంపిక నేపథ్యంలో ఈ మధ్యాహ్నం సిద్ధరామయ్య దిల్లీకి చేరుకోనున్నారు. అయితే శివకుమార్‌ కూడా వెళ్తారా లేదా అన్నది ఇంకా తెలియరాలేదు. మరోవైపు, ఈ వ్యవహారాన్ని తేల్చేందుకు వచ్చిన ఏఐసీసీ పరిశీలకుల బృందం కూడా దిల్లీకి పయనమైంది. సీఎం ఎంపికపై వారి నివేదికను హైకమాండ్‌కు అందించనున్నారు. దీన్ని పరిశీలించిన అధిష్ఠానం నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్‌ మంగళవారం నిర్ణయం తీసుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి.

2018లో ఏర్పాటైన శాసనసభ గడువు ఈ నెల 24 నాటితో ముగుస్తుంది. ఆలోగానే నూతన ప్రభుత్వం కొలువుదీరాల్సి ఉంది. గతవారం వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్‌ 135 స్థానాలతో విజయం సాధించిన విషయం తెలిసిందే.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని