Siddaramaiah: సీఎం కుర్చీ సంతోషాన్నిచ్చే చోటు కాదు..: సిద్ధరామయ్య

ముఖ్యమంత్రి కుర్చీ అంటే సంతోషాన్నిచ్చే చోటు కాదని.. ప్రజలకు సేవ చేసేందుకు దాన్నో గొప్ప అవకాశంగా భావిస్తానని అన్నారు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. శనివారం ఆయన వరుణలో నిర్వహించిన కృతజ్ఞత సభలో పాల్గొని ప్రసంగించారు.

Updated : 10 Jun 2023 19:33 IST

వరుణ: ఇటీవల జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress) విజయం సాధించడంతో కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య(Siddaramaiah) బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. శనివారం ఆయన తన సొంత నియోజకవర్గం వరుణలో పర్యటించారు. అక్కడ ఏర్పాటుచేసిన కృతజ్ఞత సభలో పాల్గొని మాట్లాడారు. ఈ ఎన్నికల్లో అవినీతి, నిర్వహణలోపం, అభివృద్ధిలేమి, సమాజాన్ని విచ్ఛిన్నం చేసే దుష్ట రాజకీయాలను ఓడించి ప్రజలు చారిత్రక నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. అందువల్ల ఈ దేశ ప్రజలకు తాను కృతజ్ఞతలు చెబుతున్నానంటూ ట్వీట్‌ చేశారు. సీఎం కుర్చీ అంటే సంతోషాన్నిచ్చే చోటు కాదని.. ప్రజలకు సేవ చేసేందుకు దాన్నో గొప్ప అవకాశంలా భావిస్తాననన్నారు.

ఇవే నా చివరి ఎన్నికలు.. కానీ!

ఇవే తన చివరి ఎన్నికలు అని ఎన్నికల ప్రచారంలోనే ప్రకటించిన సిద్ధరామయ్య మరోసారి అదే అంశాన్ని స్పష్టంచేశారు. కానీ, తన తుదిశ్వాస దాకా రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. 2013లో తాను సీఎంగా ఉన్నప్పుడు చెప్పినట్లే చేశానని.. అన్ని కులాలు, మతాలు, సమాజంలోని అన్ని వర్గాల పక్షాన నిలబడి సంక్షేమ కార్యక్రమాలను రూపొందించిన విషయాన్ని గుర్తు చేశారు. ఈసారి తమ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మరింత సమర్థవంతమైన సంక్షేమ కార్యక్రమాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. బసవను ఆదర్శంగా తీసుకొని ఆయన జయంతి రోజే సీఎంగా ప్రమాణస్వీకారం చేసినట్టు చెప్పారు. సీఎం కుర్చీ అంటే సంతోషం కలిగించే స్థలం కాదని.. ప్రజల జీవితాలను మెరుగుపరిచే ఓ గొప్ప అవకాశంగా తాను భావిస్తానని సిద్ధరామయ్య చెప్పారు.

ఇటీవల ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు అమలు కావని.. రాష్ట్రం దివాళా తీస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన.. ఎన్నికల్లో తాము ఇచ్చిన ఐదు హామీలనూ అమలు చేస్తామని చెప్పారు.  పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలిగించే పథకాలను తాము ప్రకటించినప్పుడు ప్రధాని మోదీ తమకు సహకరించాల్సింది పోయి విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మోదీ సర్కార్‌ పేద, మధ్యతరగతి ప్రజల అభివృద్ధిని కోరుకోవడం లేదని.. తమకున్న అలవాటు ప్రకారమే అసత్యాలు ప్రచారం చేస్తూ ప్రజల్లో గందరగోళం సృష్టిస్తోందని భాజపా తీరును సిద్ధరామయ్య ఆక్షేపించారు.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు చారిత్రక విజయం అందించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో కొంత గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌ మధ్య తీవ్ర పోటీ ఉండటంతో దాదాపు వారం రోజుల పాటు మల్లగుల్లాలు పడిన తర్వాత శివకుమార్‌ను బుజ్జగించిన అధిష్ఠానం సిద్ధూని సీఎంగా ఎంపిక చేసింది. దీంతో సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా, డీకే శివకుమార్‌ డిప్యూటీ సీఎంగా ప్రమాణస్వీకారం చేశారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఐదు ప్రధాన హామీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన ‘శక్తి’ స్కీమ్‌ను ఆదివారం సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌, రవాణా మంత్రి రామలింగారెడ్డి ప్రారంభించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని