Siddaramaiah vs DK Shivakumar: సిద్ధా.. శివ.. ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటకలో కాంగ్రెస్‌కు ఓటర్లు విస్పష్టమైన మెజార్టీని అందించారు. దీంతో ముఖ్యమంత్రి స్థానానికి ఆ పార్టీలోని ఇద్దరు సీనియర్‌ నేతల మధ్య రేసు మొదలైంది. ఎన్నికల్లో విజయపథంలో నడిపిన వీరిద్దరిలో ఎవరి వైపు పార్టీ అధినాయకత్వం మొగ్గు చూపుతుందనేది ఆసక్తికరంగా మారింది.

Updated : 13 May 2023 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌(Congress)కు ఓటర్లు విస్పష్టమైన ఆధిక్యాన్ని కట్టబెట్టారు. 2004 నుంచి ఆ పార్టీకి స్థాయి మెజార్టీ రావడం రెండోసారి. ఈ సారి ముఖ్యమంత్రి స్థానానికి పార్టీకి చెందిన దిగ్గజ నేతలు పోటీపడుతున్నారు. ఈ రేసులో మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య(Siddaramaiah), రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ (DK Shivakumar)ముందంజలో ఉన్నారు. మోదీ-బసవరాజ్‌ బొమ్మైలతో కూడిన భాజపా డబులింజన్‌ సర్కారుకు నినాదానికి పోటీగా సిద్ధరామయ్య-డీకే శివకుమార్‌ ద్వయం ఎదురొడ్డి నిలిచి విజయం సాధించింది. ఇప్పుడు కన్నడనాట రాజకీయం ఉత్కంఠగా మారింది. 2013లో శివకుమార్‌కు తన మంత్రి వర్గంలో స్థానం ఇవ్వడానికి కూడా సిద్ధరామయ్య కొన్ని నెలలపాటు అంగీకరించలేదు. అప్పటికే డీకే కేపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు కూడా. అలాంటిది ఇప్పుడు అతడితో కలిసి ముఖ్యమంత్రి పదవికి పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి సానుకూల ప్రతికూలాంశాలు..

కన్నడనాట అతిపెద్ద నాయకుడిగా సిద్ధరామయ్య..

కర్ణాటక రాజకీయాల్లో బీఎస్‌ యడియూరప్ప, సిద్ధరామయ్య అతిపెద్ద నాయకులు. ఇప్పుడు యడ్డీ ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నారు. దీంతో సిద్ధరామయ్యకు ఎదురులేదు. ఇటీవల నిర్వహించిన ప్రతి ముందస్తు సర్వేలో సిద్ధరామయ్య ముఖ్యమంత్రి అభ్యర్థిగా తొలిస్థానంలో నిలిచారు. ఈయనకు బాధ్యతలు అప్పగిస్తే ప్రజాతీర్పునకు అనుగుణంగా ఎంపిక చేసినట్లు అవుతుంది. కురబ సామాజిక వర్గానికి చెందిన సిద్ధరామయ్య కాంగ్రెస్‌ వ్యూహాలకు తగిన ‘అహంద’ (మైనార్టీ, బీసీ, ఎస్సీ) సామాజిక సమీకరణలకు కూడా అతికినట్లు సరిపోతారు. 2013లో ముఖ్యమంత్రిగా ఐదేళ్లపాటు నిరాటంకంగా పాలించిన అనుభవం కూడా ఆయనకు ప్లస్‌పాయింట్‌గా మారింది. దీంతోపాటు ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనడం ఇదే చివరి సారి అని సిద్ధ ప్రకటించడంతో హస్తం అధినాయకత్వం ఆయనకు అవకాశం ఇవ్వవచ్చు. ముఖ్యంగా 2024 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాని మోదీ జోరుకు అడ్డుకట్ట వేయాలంటే సిద్ధరామయ్య వంటి నేతకే కాంగ్రెస్‌ అధినాయకత్వం మొగ్గు చూపే అవకాశం ఉంది. 

సిద్ధరామయ్యకు ప్రతికూలాంశాలు కూడా ఉన్నాయి. ఆయన పాలనలోని కీలక పోస్టింగ్‌ల్లో కురుబ సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తారనే అపవాదు ఉంది. ఇలాంటి పోకడలే వక్కలిగ, లింగాయత్‌ సామాజిక వర్గాలను పార్టీకి దూరం చేశాయని విమర్శలు ఎదుర్కొన్నారు. దీంతోపాటు క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్న పీఎఫ్‌ఐ, ఎస్‌డీపీఐ కార్యకర్తలను విడుదల చేయడం విమర్శలకు దారితీసింది.

దూకుడుకు మారుపేరు డీకే..

కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ ఈ సారి ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో దూసుకు వెళుతున్నారు. తొమ్మిది సార్లు ఓటమి అనేది లేకుండా అసెంబ్లీకి ఎన్నికైన ఆయన మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఈ రేసులో పోటీ పడుతున్నారు. ట్రబుల్‌ షూటర్‌గా ఆయనకు కాంగ్రెస్‌ వర్గాల్లో పెద్ద పేరుంది. పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఒకప్పటి రాజకీయ సలహాదారు అహ్మద్‌ పటేల్‌ రాజ్యసభ ఎన్నికలో శివకుమార్‌ కీలక పాత్ర పోషించారు. గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితులైన ఆంతరంగికుల్లో శివకుమార్‌ కూడా ఒకరు. ఆయనది వక్కలిగ సామాజిక వర్గం. కర్ణాటకలోనే అత్యంత సంపన్న రాజకీయ వేత్తగా ఆయన నిలిచారు. హస్తం పార్టీకి అవసరమైన విరాళాల సేకరణలో శివకుమార్‌దే కీలక పాత్ర. 2019 లోక్‌ సభ ఎన్నికల్లో కన్నడనాట ఉన్న 28 సీట్లలో కాంగ్రెస్‌ కేవలం ఒకటి మాత్రమే సాధించింది. అది కూడా డీకే సోదరుడు సురేష్‌ గెలిచిన స్థానం. ఇలాంటి గడ్డు పరిస్థితుల్లో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. దర్యాప్తు సంస్థల దాడులు, అరెస్టులకు ఎదురొడ్డి నిలిచి 2023లో పార్టీకి అధికారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించారు.

తాజాగా ముఖ్యమంత్రి పీఠం అందుకోవడానికి ఆ కేసులే అడ్డుగా నిలిచే అవకాశం ఉంది. ఆయనపై సీబీఐ, ఈడీ, ఐటీ శాఖలు పలు కేసులు నమోదు చేశాయి. 104 రోజులు తిహాడ్‌ జైల్లో గడిపివచ్చారు. ఇప్పుడు ఆయన సీఎం పీఠం ఎక్కితే పాత కేసుల్లో విచారణలు సమయంలో పార్టీకి ఇబ్బందులు ఎదురవుతాయనే భయాలున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీ వీరిద్దరు కాకుండా మూడో వ్యక్తిని కూడా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పరిశీలించే అవకాశాలు లేకపోలేదు. మాజీ ఉపముఖ్యమంత్రి జి.పరమేశ్వర వంటి నేతల పేర్లు కూడా ఈ రేసులో వినిపిస్తున్నాయి. పరమేశ్వర రాష్ట్రంలోని బలమైన వర్గం ఎస్సీలకు చెందినవారు. రానున్న లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా ఆయన అభ్యర్థిత్వాన్ని పరిశీలించే అవకాశం లేకపోలేదు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని