Punjab politics: ఆ ఇద్దరినీ తొలగించాల్సిందే.. సిద్ధూ డిమాండ్‌!

పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం అప్పుడే సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్ నియామకాన్ని తప్పుబట్టిన పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు.

Published : 04 Oct 2021 01:10 IST

చండీగఢ్‌: పంజాబ్‌ కాంగ్రెస్‌లో నెలకొన్న వివాదం అప్పుడే సమసిపోయే సూచనలు కనిపించడం లేదు. డీజీపీ, అడ్వొకేట్‌ జనరల్ నియామకాన్ని తప్పుబట్టిన పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ ఈ విషయంలో ఏమాత్రం వెనక్కి తగ్గడంలేదు. వారిద్దరినీ వెంటనే తొలగించాలని తాజాగా మరోసారి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. వారిని తొలగించకపోతే ప్రజల్లో  తలెత్తుకు తిరగలేమని పేర్కొంటూ ఆదివారం ట్వీట్ చేశారు.

కొత్త సీఎం చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ నేతృత్వంలోని ప్రభుత్వం డీజీపీగా ఇక్బాల్‌ ప్రీత్‌సింగ్‌ సహోతాకు బాధ్యతలు అప్పగించడం, అమర్‌ప్రీత్‌సింగ్‌ డియోల్‌ను అడ్వొకేట్‌ జనరల్‌గా నియమించడాన్ని సిద్ధూ తప్పుబట్టారు. పీసీసీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో చన్నీ, సిద్ధూ భేటీ అయ్యారు. ప్రభుత్వానికి, పార్టీకి మధ్య సమన్వయం కోసం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీంతో శాంతించినట్లు కనిపించిన సిద్ధూ.. మూడు రోజుల తిరగకముందే మరోసారి తన అసంతృప్తిని వెళ్లగక్కారు.

‘‘డ్రగ్స్‌ రాకెట్‌ కేసులో ప్రధాన నిందితులను పట్టుకోకపోవడం వంటి అంశాల్లో విఫలమవ్వడం వల్లే గత సీఎంను ప్రజలు పక్కకు తప్పించారు. వాటిపై పోరాటం వల్లే 2017లో మన ప్రభుత్వం ఏర్పాటైంది. తాజాగా అడ్వొకేట్‌ జనరల్‌, డీజీపీ నియమించడం అంటే.. నాటి బాధితుల గాయాలపై కారం చల్లడమే అవుతుంది. వారిని తొలగించకపోతే ప్రజల్లో తలెత్తుకు తిరగలేం’’ అని సిద్ధూ ట్వీట్‌ చేశారు. 2015లో గురుగ్రంథ్‌ సాహిబ్‌ను అవమానించారనే కేసులో అకాలీ ప్రభుత్వం నేతృత్వంలో ఏర్పాటైన సిట్‌కు సహోతా నేతృత్వం వహించగా..పలు ఆరోపణలున్న వివాదాస్పద మాజీ డీజీపీ సమేధ్‌సింగ్‌ సెయినీ తరఫున డియోల్‌ వాదనలు వినిపించారు. వీరి నియామకాల ద్వారా ప్రతిపక్షాల చేతికి ఆయుధాన్ని ఇచ్చినట్లు అవుతుందని సిద్ధూ వ్యతిరేకిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని