
Navjot Singh Sidhu: ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోతాయ్..!
సిద్ధూ వివాదాస్పద వ్యాఖ్యలు.. భాజపా మండిపాటు
చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ నవజోత్ సింగ్ సిద్ధూ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ప్రశంసించే క్రమంలో పోలీసులపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు తలచుకుంటే పోలీసుల ప్యాంట్లు తడిచిపోయేలా చేయగలరంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆయనపై విమర్శలు వెల్లువెత్తడమేగాక, పోలీసులు ఆయనపై పరువు నష్టం దావా కూడా వేశారు. అసలేం జరిగిందంటే..
ఇటీవల సుల్తాన్‌పూర్ లోధిలో జరిగిన ఓ సభలో పాల్గొన్న సిద్ధూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే నవతేజ్ సింగ్ చీమాను ప్రశంసిస్తూ.. ‘‘ఎమ్మెల్యే తన అధికార బలంతో పోలీసుల ప్యాంట్లు తడిచేలా చేయగలరు’’ అని వ్యాఖ్యానించారు. గత ఆదివారం బటాలాలో జరిగిన సభలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవడంతో ఆయనపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దీనిపై విలేకరులు ఆయనను ప్రశ్నించగా.. సిద్ధూ తన వ్యాఖ్యలను సమర్థించుకోవడం గమనార్హం.
పోలీసుల పరువునష్టం దావా..
అయితే సిద్ధూ వ్యాఖ్యలపై పోలీసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘ఓ సీనియర్ నాయకుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం, పోలీసులను అవమానించడం సిగ్గుచేటు. వీటిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయనను, ఆయన కుటుంబాన్ని రక్షిస్తున్నది పోలీసులే కదా. మా భద్రతే గనుక లేకపోతే.. ఆయన మాటను కనీసం రిక్షా లాక్కొనే వ్యక్తి కూడా పట్టించుకోడు’’ అని చండీగఢ్ డీఎస్పీ దిల్షేర్ సింగ్ చందేల్ అన్నారు. ఆయనకు పరువునష్టం నోటీసులు పంపించినట్లు తెలిపారు.
సిద్ధూ వ్యాఖ్యలు సిగ్గుచేటు..
సిద్ధూ వ్యాఖ్యలపై భాజపా తీవ్రంగా మండిపడింది. ‘‘కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన నవజోత్ సింగ్ సిద్ధూ పోలీసులపై తప్పుడు పదజాలం ఉపయోగించడం సిగ్గుచేటు’’ అని భాజపా ట్విటర్ వేదికగా విమర్శించింది. అటు పంజాబ్ మాజీ సీఎం అమరీందర్ సింగ్, శిరోమణి అకాలీదళ్‌నేత దల్జీత్ సింగ్ కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రజల రక్షణ కోసం శ్రమించే పోలీసులను అవమానించడం తగదని, వారికి సిద్ధూ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.