Sitaram Yechury: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నిక

భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కన్నూర్‌లో జరుగుతున్న 23వ అఖిల భారత మహా సభ చివరి రోజు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు.

Updated : 10 Apr 2022 23:11 IST

కన్నూర్‌ (కేరళ): భారత కమ్యూనిస్టు పార్టీ (మార్కిస్టు) ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి మరోసారి ఎన్నికయ్యారు. కేరళలోని కన్నూర్‌లో జరుగుతున్న 23వ అఖిల భారత మహాసభ చివరి రోజు ప్రధాన కార్యదర్శిని ఎన్నుకున్నారు. దీంతో సీతారాం ఏచూరి వరుసగా మూడోసారి ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

2015లో విశాఖలో జరిగిన 21వ మహాసభలో తొలిసారి ప్రధాన కార్యదర్శిగా ఏచూరి ఎన్నికయ్యారు. ప్రకాశ్‌ కారట్‌ నుంచి ఆ బాధ్యతలు స్వీకరించారు. 2018లో హైదరాబాద్‌లో జరిగిన 22వ మహాసభలోనూ ఆయన రెండోసారి ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. జేఎన్‌యూ (దిల్లీ)లో ఎంఏ పూర్తి చేసిన ఏచూరి.. అదే యూనివర్సిటీలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా మూడుసార్లు ఎన్నికయ్యారు. 1975లో సీపీఎంలో చేరిన ఆయన.. క్రమక్రమంగా పార్టీ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారు.

ఇక ప్రధాన కార్యదర్శితో పాటు 85 మందితో కూడిన కేంద్ర కమిటీని కూడా మహాసభ ఎన్నుకుంది. వీరిలో 17 మంది కొత్త ముఖాలకు చోటు దక్కింది. కేంద్ర కమిటీకి ఎన్నికైనవారిలో బీవీ రాఘవులు, ఎస్‌.పుణ్యవతి, వి.శ్రీనివాసరావు, ఎంఎ గఫూర్‌, అరుణ్‌ కుమార్‌ ఏపీకి చెందిన వారుకాగా.. తమ్మినేని వీరభద్రం, సీహెచ్‌.సీతారాములు, జి.నాగయ్య, బి.వెంకట్‌ తెలంగాణకు చెందినవారు. 17 మందితో కూడిన పొలిట్‌బ్యూరోలో తెలుగు రాష్ట్రాల నుంచి బీవీ రాఘవులు ఒక్కరే ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని