Cooperation Ministry: రాష్ట్రాల హక్కులను హరించేందుకే ఆ శాఖ..!

రాష్ట్రాల హక్కులను హరించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు.

Published : 09 Jul 2021 01:29 IST

దిల్లీ: రాష్ట్రాల హక్కులను హరించేందుకే ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారంటూ సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. మంత్రివర్గ విస్తరణపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ ప్రభుత్వంపై ఆయన విమర్శనాస్త్రాలు సంధించారు. ప్రధాని తాజా నిర్ణయం కేంద్రం, రాష్ట్రాల మధ్య సంబంధాలపై ప్రభావం చూపుతుందన్నారు. భారత రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం సహకార సంఘాలు పూర్తిగా రాష్ట్రాలకు సంబంధించిన అంశమని పేర్కొన్నారు. అయితే కేంద్రంలో సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టడంలో ఉద్దేశమేమిటంటూ ప్రశ్నించారు. ఇది సహకార సమాఖ్యవాదానికి, రాష్ట్రాల ప్రయోజనాలకు వ్యతిరేకమన్నారు.

రుణాల పేరుతో బడా వ్యాపారవేత్తలకు భారీగా రుణాలిచ్చి ప్రభుత్వరంగ బ్యాంకులను కేంద్రం దోచుకుందని సీతారాం ఏచూరి ఆరోపించారు. అదంతా ప్రజల సొమ్మేనని పేర్కొన్నారు. ఇక సహకార బ్యాంకులనూ దోచుకోవడానికే కేంద్రం తాజా నిర్ణయం తీసుకుందంటూ విమర్శించారు. రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని చర్చకు తీసుకొస్తే వ్యతిరేకిస్తామని స్పష్టం చేశారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు తమలాగే వ్యతిరేకించాలని కోరారు. తమ కేబినెట్‌లోనే ఎక్కువ మంది మహిళా మంత్రులున్నారని ఏడేళ్లుగా మోదీ సర్కారు చెప్పుకొంటోంది. కానీ వారు నెరవేర్చని పలు హామీల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇంతకాలంగా ఆ బిల్లు పార్లమెంటులో ఎందుకు పెండింగ్‌లో ఉందో మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం మంత్రివర్గ విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఈసారి కేంద్రంలో కొత్తగా సహకార మంత్రిత్వ శాఖను ప్రవేశపెట్టారు. ఈ శాఖను హోంమంత్రి అమిత్‌ షాకుకేటాయించారు. దేశంలోని సహకార సంస్థలను పునరుద్ధరించడం సహా గ్రామీణ ప్రాంతాల్లో రైతులపై జరుగుతున్న దోపిడీని ఈ కొత్త శాఖ అరికటడుతుందని సర్కారు చెబుతోంది.  

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని