వారిపై సర్జికల్‌ స్ట్రైక్‌ కొనసాగుతుంది: స్మృతి

హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రజలు భాజపాకు మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ..

Updated : 25 Nov 2020 14:02 IST

హైదరాబాద్‌: హైదరాబాద్‌ అభివృద్ధి కోసం ప్రజలు భాజపాకు మద్దతు తెలపాలని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ విజ్ఞప్తి చేశారు. భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. గడిచిన ఐదేళ్లలో జీహెచ్‌ఎంసీ పరిధిలో వేలకోట్లు ఖర్చు చేసినట్లు తెరాస అబద్దాలు చెబుతోందని విమర్శించారు. 

పాతబస్తీలో రోహింగ్యాలకు ఎందుకు ఓటు హక్కు కల్పించారని ప్రశ్నించారు. రోహింగ్యాలు, బంగ్లాదేశీయులకు ఏ నిబంధనల మేరకు ఓటు హక్కు కల్పించారని నిలదీశారు. హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న విదేశీయుల గురించి తెరాస, మజ్లీస్‌ పార్టీలు ఎందుకు మాట్లాడవని ప్రశ్నించారు. దాదాపు 75వేల మంది విదేశీయులు అక్రమంగా హైదరాబాద్‌ నగరంలో ఎలా నివసిస్తున్నారని నిలదీశారు. అక్రమ చొరబాటు దారుల నుంచి దేశాన్ని భాజపా కాపాడుతుందని స్పష్టం చేశారు. సబ్‌కాసాత్‌  సబ్‌కా వికాస్‌తో భాజపా ముందుకెళ్తోందని స్మృతి ఇరానీ తెలిపారు.

వరద నష్టంపై నివేదిక పంపలేదు..

వరద నష్టంపై ఇప్పటి వరకు సమగ్ర నివేదికలు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి పంపలేదన్నారు. ఒక్క కుటుంబ మాత్రమే కాదు.. ఎందరో త్యాగాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పడిందన్నారు. పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్న వారిపై సర్జికల్‌ స్ట్రైక్‌ కొనసాగుతుందని స్పష్టం చేశారు. శాంతి భద్రతల సమస్య రాష్ట్రం పరిధిలోని అంశమని, తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేస్తే రోహింగ్యాలపై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు. తెలంగాణలో ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని అమలు చేసి ఉంటే ...కరోనా సోకిన పేదలకు లబ్ధి చేకూరేదన్నారు. పారదర్శకమైన పాలన అందించటమే భాజపా లక్ష్యమని స్పష్టం చేశారు. లెటర్‌ హెడ్స్‌తో ఎంఐఎం నాయకులు రోహింగ్యా ముస్లింలను కాపాడుతున్నారని ఆరోపించారు. అక్రమ వలసదారులకు ఓటు హక్కు తొలగించాలని డిమాండ్‌ చేశారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం టెక్స్‌టైల్‌ పార్క్‌ మంజూరు చేసిందని తెలిపారు. కేంద్రం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలు తెలంగాణ ప్రభుత్వం అమలు చేయటంలేదన్నారు. హామీల అమల్లో తెరాస ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని స్మృతి ఇరానీ విమర్శించారు.
 


Read latest Politics News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని