Corona: రాహుల్‌జీ.. ఈ ప్రశ్నలకు జవాబులు చెప్పండి!

ప్రధాని మోదీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను..కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. 

Published : 23 Jun 2021 01:22 IST

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కౌంటర్‌

దిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కరోనా కట్టడిలో విఫలమైందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను.. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తిప్పికొట్టారు. ఆయనను జ్ఞాన బాబాగా పేర్కొంటూ, తన జ్ఞానాన్ని ఇతరులకు పంచేముందు కొన్ని అంశాలను గమనించాలని కోరారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఉద్దేశిస్తూ పలు ప్రశ్నలు సంధించారు. 

కరోనా రెండోదఫా విజృంభణ ఎక్కడ ప్రారంభమైంది? 

• భారత్‌లో అధిక శాతం కరోనా కేసులు, మరణాలు ఎక్కడ నమోదయ్యాయి?

• మరణాల రేటు అత్యధికంగా ఉన్న రాష్ట్రమేది?

• ఏ రాష్ట్రాలు కరోనా టీకాల గురించి అనవసరంగా గగ్గోలు పెట్టాయి? 

• రెండోదశలో పాజిటివిటీ రేటు ఏ రాష్ట్రాల్లో ఎక్కువగా నమోదైంది? ఈ ప్రశ్నలన్నింటికి ఒకే ఒక్క సమాధానం.. ‘కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. అయితే ఆ రాష్ట్రాల పేర్లను మాత్రం ప్రస్తావించలేదు. 

రెండోదశలో దేశం చవిచూసిన కొవిడ్ పరిస్థితులపై రాహుల్ గాంధీ శ్వేతపత్రం విడుదల చేశారు. భవిష్యత్తులో కరోనా విజృంభణలపై అది బ్లూప్రింట్‌లా ఉపయోగపడుతుందని అధికారులకు సూచించారు. అలాగే కొవిడ్ కేసులు పెరుగుతున్న వేళ ప్రధాని మోదీ దృష్టంతా బెంగాల్‌ ఎన్నికలపైనే ఉందని విమర్శించారు. ఆయన కన్నీళ్లు.. ప్రజల కన్నీళ్లను తుడవలేవంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. భారత్‌లో రెండోదశ కరోనా ఉగ్రరూపం చూపింది. మే 7న రికార్డు స్థాయిలో నాలుగులక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. అయితే ప్రజలు కొవిడ్ నిబంధనల పట్ల నిర్లక్ష్యం వహిస్తే, మూడో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని