Bihar Politics: ‘కొంతమంది నేతల అత్యాశే.. నా తండ్రి ఉద్యమాన్ని బలహీనపరిచింది’

బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్ పారస్‌పై పార్టీ నేత, వరుసకు కుమారుడైన చిరాగ్ పాసవాన్‌ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘అధికారం కోసం కొంతమంది పార్టీ నేతల అత్యాశ.. సమాజంలో...

Published : 04 Oct 2021 01:08 IST

పాట్నా: బిహార్‌కు చెందిన లోక్ జనశక్తి పార్టీ(ఎల్‌జేపీ) జాతీయ అధ్యక్షుడు పశుపతి కుమార్ పారస్‌పై పార్టీ నేత, వరుసకు కుమారుడైన చిరాగ్ పాసవాన్‌ ఆదివారం పరోక్షంగా విరుచుకుపడ్డారు. ‘అధికారం కోసం కొంతమంది పార్టీ నేతల అత్యాశ.. సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం తన తండ్రి రాంవిలాస్ పాసవాన్‌ ప్రారంభించిన ఉద్యమాన్ని బలహీనపరిచింద’ని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూన్‌లో పార్టీ రెండుగా చీలిపోవడంతో ఇరువర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ వివాదం నేపథ్యంలో శనివారం కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) పార్టీ పేరు, ఎన్నికల గుర్తును స్తంభింపజేస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

రెండు స్థానాలకు ఉప ఎన్నికల వేళ..

ఈ వ్యవహారంపై చిరాగ్‌ స్పందిస్తూ.. ‘సమాజంలో అణగారిన వర్గాల గొంతుకను వినిపించేందుకు రాంవిలాస్‌ పాసవాన్‌ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమానికి పార్టీ స్వరంగా నిలిచింది. కానీ, కొంతమంది పార్టీ నేతలు అధికార అత్యాశలో చిక్కుకోవడంతో ఉద్యమం బలహీనపడింది’ అని ట్వీట్‌ చేశారు. ‘ఇది ఎన్నికల కమిషన్ మధ్యంతర నిర్ణయం. అధికారులు మా వాదనలను పరిగణనలోకి తీసుకున్నారు’ అని పేర్కొన్నారు. ఈ నెల 30న బిహార్‌లో కుషేశ్వర్‌ ఆస్థాన్‌, తారాపూర్‌ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎన్నికల సంఘం నిర్ణయం వెలువడటం గమనార్హం. ఒకవేళ ఈ ఉప ఎన్నికల్లో తమ అభ్యర్థులను పోటీలో పెట్టాలనుకుంటే అందుబాటులో ఉన్న గుర్తులను వాడుకోవచ్చని ఈసీఐ తెలిపింది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాలూ వేర్వేరుగా పార్టీల పేర్లు, ఎన్నికల గుర్తులను సోమవారం మధ్యాహ్నం ఒంటి గంట కల్లా తెలియపరచాలని సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని