Nitish Kumar: ఇక్కడ ప్రశాంత్ కిశోర్ అభిప్రాయం ముఖ్యం కాదు..!

స్వరాష్ట్రం బిహార్‌ రూపు రేఖలు మార్చేందుకుగాను భావ సారూప్యమున్న వ్యక్తులతో పనిచేయనున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు.

Published : 07 May 2022 01:36 IST

పట్నా: స్వరాష్ట్రం బిహార్‌ రూపు రేఖలు మార్చేందుకుగాను భావసారూప్యత ఉన్న వ్యక్తులతో పనిచేయనున్నట్లు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. దాని కోసం ‘జన్‌ సురాజ్’ అనే వేదికను ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్రమంలో బిహార్‌లోని జేడీయూ-భాజపా సంకీర్ణ ప్రభుత్వంనా విమర్శలు చేయగా.. ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ దీటుగా స్పందించారు. పీకే అభిప్రాయం తనకు ముఖ్యం కాదన్నారు. ‘మేం బిహార్‌లో మంచి చేశామా లేదా అని మీకు తెలుసు. ఒకరి అభిప్రాయం నాకు ముఖ్యం కాదు. ఇక్కడ నిజం మాత్రమే ముఖ్యం. ప్రజలకు మా పని ఏంటో తెలుసు. ఇక్కడ మేం ఎంత పనిచేశామో, వాస్తవమేంటో మీకు (ప్రజలు) తెలుసు కాబట్టి.. ఒకరు వ్యాఖ్యలు చేసినప్పుడు మీరే సమాధానం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను’ అంటూ నీతీశ్‌ మీడియాతో వ్యాఖ్యానించారు. 

లాలూ ప్రసాద్ యాదవ్‌, నీతీశ్ కుమార్ 30 ఏళ్ల పాలనలో బిహార్‌ అత్యంత వెనుకబడిన, పేద రాష్ట్రంగా  మిగిలిపోయిందని ప్రశాంత్ కిశోర్ విమర్శించారు. గత 15 ఏళ్లలో బిహార్‌కు మంచేమీ జరగలేదన్నారు. అభివృద్ధి ప్రమాణాలపరంగా ఈ రాష్ట్రం అట్టడుగున ఉందంటూ నీతీశ్ పాలనపై విమర్శలు గుప్పించారు. ఓవైపు పాలనలో లోపాలను ఎత్తిచూపుతూనే.. ‘నీతీశ్‌కు నాకు వ్యక్తిగతంగా ఎలాంటి విబేధాలు లేవు. మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలున్నాయి. వ్యక్తిగత సంబంధాలు, పని వేర్వేరు. నీతీశ్ ఏదైనా సమావేశం పెట్టి పిలిస్తే.. నేను వెళ్తాను. దానర్థం అక్కడ చెప్పినవన్నీ ఒప్పుకొన్నట్లు కాదు. ఆయన నాకు తండ్రి సమానులు’ అంటూ పీకే స్పందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని