Somu Veerraju: ఫొటోలకు పోజులిచ్చే జగన్‌కు రోడ్లు వేసే దమ్ము లేదు: సోము వీర్రాజు

పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్‌కి తెలుసా?.. విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్రం రూ. వేల కోట్ల నిధులిస్తే.. సీఎం జగన్ విశాఖకు చేసిందేమీ లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. అలాంటిదేమైనా ఉంటే చెప్పాలని సోము డిమాండ్‌ చేశారు.

Updated : 14 Oct 2022 15:17 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతి ప్రాంతంలో మౌలిక వసతుల కల్పనపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. అమరావతి పరిధిలో ఉన్న ప్రైవేటు యూనివర్సిటీలకు రహదారులు, ఇతర మౌలిక వసతులను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇక్కడ చదువుతున్నారనే కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. యూనివర్సిటీ యాజమాన్యాలపైన రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మౌలిక వసతుల కల్పనపై ఎన్ని సార్లు చెప్పినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేశారు.

‘‘అమరావతిలోనే రాజధాని ఉంటుందని చెప్పి.. అధికారంలోకి వచ్చాక జగన్‌ మాట తప్పారు. విశాఖకు సీఎం జగన్ ఏం చేశారో చెప్పాలి. పరిపాలన వికేంద్రీకరణ అంటే ఏంటో జగన్‌కి తెలుసా? విశాఖపట్నం అభివృద్ధి కోసం కేంద్రం రూ. వేల కోట్ల నిధులు ఇచ్చింది. జగన్ విశాఖకు చేసిందేమీ లేదు.. ఉంటే చెప్పాలి. మూడేళ్లల్లో ఏపీలో ఏం చేశారో చెప్పాలి. అమరావతి రైతులు యాత్ర చేస్తుంటే కుట్రలు పన్నుతున్నారు. వారిని అడ్డుకోవాలని చూస్తున్నారు. రైతుల ఉద్యమానికి భాజపా అండగా ఉంటుంది. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపేలా ప్రధాని మోదీ ఐకానిక్ బ్రిడ్జి వేస్తున్నారు. కోడూరు, మేదరమెట్ల రోడ్డుకు టెండర్లు పిలిచారు. ఏపీలో అనేక వంతెనలు, జాతీయ రహదారుల నిర్మాణం చేపడుతున్నారు. ఫొటోలకు పోజులిచ్చే జగన్‌కు రోడ్లు వేసే దమ్ము లేదు. విజయవాడలో మూడు ఫ్లైఓవర్లు, ఎయిమ్స్ కేంద్రం కట్టింది. ఉత్తరాంధ్ర అభివృద్ధిపై సీఎం జగన్‌ బహిరంగ చర్చకు రాగలరా?’’ అని సోము సవాల్‌ విసిరారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని