
ఓ సోదరుణ్ని కోల్పోయాను: సోనియా
అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ దిగ్భ్రాంతి
దిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నేత, దిగ్గజ నాయకుడు అహ్మద్ పటేల్ మృతి పట్ల సోనియా గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయనను గొప్ప ప్రజ్ఞాశాలిగా కీర్తించిన ఆమె క్లిష్ట సమయాల్లో సలహాల కోసం ఎన్నోసార్లు ఆయనను సంప్రదించానని గుర్తుచేసుకున్నారు.
‘‘కాంగ్రెస్ పార్టీ కోసం తన జీవితాన్నే అంకితం చేసిన నా సహచరుడు అహ్మద్ పటేల్‌ని కోల్పోయాను. అహ్మద్‌జీ గొప్ప ప్రజ్ఞాశాలి. విధుల పట్ల ఆయన నిబద్ధత, బాధ్యత, విశ్వసనీయత ఆయన్ని ప్రత్యేక వ్యక్తిగా నిలిపాయి. ఇతరులకు సహాయపడడం, దయాహృదయం ఆయనలోని గొప్ప గుణాలు. ఆయన లేని లోటు పూడ్చలేనిది. ఓ నమ్మకమైన సహచరుడు, స్నేహితుడు, సోదరుడిగా ఉన్న వ్యక్తిని ఈరోజు నేను కోల్పోయాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ సోనియా గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు
‘‘అహ్మద్ పటేల్ మరణించిన ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓ దుర్దినం. పార్టీకి ఆయనొక మూలస్తంభంగా వ్యవహరించారు. కాంగ్రెస్ పార్టీయే శ్వాసగా జీవించారు. క్లిష్ట సమయాల్లో పార్టీకి అండగా నిలబడ్డారు. ఇకపై ఆయన మాతో లేకపోవడం పూడ్చలేని లోటు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి’’ - రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ప్రియాంక గాంధీ సైతం అహ్మద్ పటేల్ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఏ సలహా, సూచన కోసం వెళ్లినా సరైన మార్గనిర్దేశం చేసేవారని గుర్తుచేసుకున్నారు. ఆయన లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీర్చలేని లోటని వ్యాఖ్యానించారు. అన్ని క్లిష్టసమయాల్లో తమకు అండగా నిలిచారని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.
సుదీర్ఘ కాలం కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన అహ్మద్ పటేల్‌కు నెహ్రూ-గాంధీ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం ఉంది. రాజీవ్ హయాం నుంచి రాహుల్ గాంధీ వరకు ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సోనియా రాజకీయాల్లోకి ప్రవేశించిన నాటి నుంచి ఆమె బృందంలో కీలక వ్యక్తిగా వ్యవహరించారు. సుదీర్ఘకాలం ఆమెకు రాజకీయ సలహాదారుగా ఉన్నారు.