
Sonia Gandhi: విపక్ష నేతలతో భేటీ అయిన సోనియా గాంధీ
దిల్లీ: కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాలను ఏకతాటిపై తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ శుక్రవారం విపక్ష నేతలతో భేటీ అయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశంలో రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(డీఎంకే), పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(తృణమూల్ కాంగ్రెస్), నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఫరూక్ అబ్దుల్లా, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే(శివసేన), ఝార్ఖండ్ ముక్తి మోర్చా నేత హేమంత్ సోరెన్, ఎల్జేడీ నేత శరద్ యాదవ్, సీపీఎం నేత సీతారాం ఏచూరి తదితరులు పాల్గొన్నారు.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి రోజున ఈ సమావేశం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలతో పాటు వచ్చే ఏడాదిలో జరగనున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, 2024లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో భాజపాను ఓడించే అంశంపై అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహంపై చర్చిస్తున్నట్లు సమాచారం.