Covidపై వెంటనే అఖిలపక్షాన్ని పిలవండి..!

కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు.

Updated : 09 May 2021 03:43 IST

ప్రధానిని కోరిన కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ

దిల్లీ: కరోనా వైరస్‌ మహమ్మారిని ఎదుర్కోవడంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. మహమ్మారిపై పోరులో వ్యవస్థ విఫలం కాలేదని.. మోదీ ప్రభుత్వమే వైఫల్యం చెందిందనే విషయం స్ఫష్టంగా తెలుస్తోందని దుయ్యబట్టారు. దేశంలో నెలకొన్న తాజా పరిస్థితులపై చర్చించేందుకు వెంటనే అఖిల పక్షసమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి సోనియా విజ్ఞప్తి చేశారు.

కరోనా పరిస్థితులపై చర్చించేందుకు జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ(సీపీపీ) సమావేశంలో కేంద్ర ప్రభుత్వ తీరును కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులు ఎండగట్టారు. ‘భారత్‌ ప్రస్తుతం ఘోరమైన ఆరోగ్య విపత్తును ఎదుర్కొంటోంది. నిత్యం వేల మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు ఔషధాలు, ఆక్సిజన్‌, వ్యాక్సిన్‌ల కొరతతో పాటు సరైన వైద్య సదుపాయాలు అందక లక్షల మంది బాధితులు అల్లాడిపోతున్నారు. ప్రజలు ప్రాణాలు రక్షించుకోవడానికి ఆస్పత్రుల ముందు, రోడ్ల మీద పడిగాపులు పడుతున్న పరిస్థితి చూస్తుంటే మనసు చలించిపోతోంది’ అని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు.

సెకండ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలంటూ ప్రభుత్వ వైద్య ఆరోగ్య నిపుణులు, కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ హెచ్చరించాయని సోనియా గాంధీ గుర్తుచేశారు. అయినప్పటికీ మహమ్మారిని ఎదుర్కోవడానికి కేంద్ర ప్రభుత్వం సరైన ప్రణాళిక సిద్ధం చేయకపోవడం విచారకరమన్నారు. సెకండ్‌ వేవ్‌ విజృంభిస్తోన్న వేళ ఆక్సిజన్‌ కొరత ఏర్పడటం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అవసరమైన వ్యాక్సిన్‌లను ముందుగానే ఆర్డర్ చేసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని సోనియాగాంధీ విమర్శించారు. ఇలా అన్ని రకాలుగా వైఫల్యం చెందిన మోదీ ప్రభుత్వం.. కీలక సమయంలో ఏం చేస్తోందని ఆమె ప్రశ్నించారు.

ఏదేమైనప్పటికీ కరోనా మహమ్మారిపై రాజకీయాలకు అతీతంగా సమష్టిగా పోరాడాల్సిన సమయమని సోనియా గాంధీ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో నెలకొన్న పరిస్థితులను చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ప్రధానికి సూచించారు. అంతేకాకుండా కరోనా పోరులో చేపట్టే చర్యల్లో జవాబుదారీతనం ఉండేందుకు స్టాండింగ్‌ కమిటీలను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇక దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతున్న వేళ.. కొవిడ్‌ బాధితులకు అండగా ఉండేందుకు తమ పార్టీ నుంచి రాష్ట్ర, జిల్లా స్థాయిలో కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేయాలని సీపీపీ సమావేశంలో కాంగ్రెస్‌ నేతలకు సోనియాగాంధీ సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు