UP Polls: ప్రజా సమస్యలు గాలికి.. ఉగ్రవాదం నెత్తికి: భాజపా, ఎస్పీపై మండిపడ్డ ప్రియాంక

సామాన్యులకు అవసరమైన వాటి గురించి మాట్లాడకుండా.. భాజపా, సమాజ్​వాదీ పార్టీలు ఉగ్రవాదం గురించి ప్రసంగాలు ఇస్తున్నాయని.......

Published : 24 Feb 2022 01:40 IST

లఖ్‌నవూ: సామాన్యులకు అవసరమైన వాటి గురించి మాట్లాడకుండా.. భాజపా, సమాజ్​వాదీ పార్టీలు ఉగ్రవాదం గురించి ప్రసంగాలు ఇస్తున్నాయని కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా మండిపడ్దారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, మహిళా సాధికారత, చిన్న వ్యాపారులకు, రైతులకు ఆర్థికసాయం లాంటి అంశాలను పక్కదోవ పట్టించి ఉగ్రవాదం అనే అంశంపై దృష్టిసారించారని విమర్శలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజల దృష్టి మళ్లించేందుకు ఉగ్రవాదం అంశాన్ని తెరపైకి తీసుకువచ్చారని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ప్రియాంక మాట్లాడారు.

‘ప్రధాన సమస్యలైన ద్రవ్యోల్బణం తగ్గింపు, ఉపాధి, మహిళా సాధికారతతోపాటు చిన్న, మధ్యతరహా వ్యాపారాలకు మద్దతుగా నిలవడం, రైతులకు కనీస మద్దతు ధర లాంటి వాటిపై ఎస్​పీ, భాజపా చర్చించడం లేదు. వాటిని పక్కదారి పట్టించి.. ఉగ్రవాదంపై మాట్లాడుతున్నారు’ అని మండిపడ్డారు. ఉగ్రవాదంపై లెక్చర్లు ఇవ్వడంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ బిజీగా ఉన్నారని ప్రియాంక ఎద్దేవా చేశారు. ఆయనకు పర్సంటేజీల్లో మాట్లాడటం ఇష్టం అని విమర్శించారు. ఇది కాకుండా.. రాష్ట్రంలో నిరుద్యోగులు ఎంత శాతం ఉన్నారనే దానిపైనా చర్చించాలని సూచించారు.

ఎన్నికల ప్రచారంలో మహిళా సమస్యలపై కాంగ్రెస్​ ప్రస్తావించిన తరువాతే ఇతర పార్టీలు మాట్లాడుతున్నాయని ఆమె దుయ్యబట్టారు. పశువులను విచ్చలవిడిగా వదిలేయడంపై ప్రధాని మోదీ రాజకీయం చేస్తున్నారని ఆరోపించిన ప్రియాంక.. గత ఎన్నికల సమయంలోనే తాము ఈ అంశాన్ని ప్రస్తావించినట్లు గుర్తు చేశారు. ‘విచ్చలవిడిగా వదిలేసిన పశువుల సమస్యను మేము 2019లోనే లేవనెత్తాం.  అయితే ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో ప్రధానమంత్రి దీనిపై మాట్లాడుతున్నారు. ఉత్తరభారత్‌లోని అనేక ప్రాంతాల్లో దీని వల్ల చాలా నష్టం జరిగింది. అయితే ప్రధానికి ఇప్పుడే ఇది కనిపించిందా?’ అని  ప్రశ్నించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని