New Front: కాంగ్రెస్‌ లేకుండా కూటమి.. కొత్త ఫ్రంట్‌పై దీదీ, అఖిలేష్‌ చర్చలు!

కేంద్రంలో భాజపాతోపాటే కాంగ్రెస్‌కూ (Congress) దూరంగానే ఉంటామని మమతా బెనర్జీ (Mamata Banerjee), అఖిలేష్‌ యాదవ్‌లు (Akhilesh Yadav) నిర్ణయించారు. త్వరలోనే బీజేడీ అధినేత నవీన్‌ పట్నాయక్‌తోనూ భేటీ కానున్నట్లు వెల్లడించారు.

Published : 18 Mar 2023 01:41 IST

కోల్‌కతా: కేంద్రంలో మోదీ నేతృత్వంలోని భాజపాను (BJP) ఎదుర్కొనేందుకు విపక్షాలన్నీ ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ.. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. భాజపాతో పాటు కాంగ్రెస్‌కు కూడా సమదూరం పాటించాలని తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీలు నిర్ణయించాయి. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) మర్యాదపూర్వకంగా భేటీ అయిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ (Akhilesh Yadav).. కాంగ్రెస్‌ మద్దతు లేకుండానే కేంద్రంపై పోరాటం చేస్తామన్నారు. ఈ క్రమంలో త్వరలోనే ఒడిశా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక్‌తోనూ (Naveen Patnaik) మమతా బెనర్జీ వారం రోజుల్లో భేటీ కానున్నారు.

భాజపా, కాంగ్రెస్‌ పార్టీలకు సమాన దూరంలో ఉంటామని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. మమతా బెనర్జీ నివాసంలో పార్టీ నేతలతో కలిసి భేటీ అయిన ఆయన.. కాషాయ పార్టీని ఓడించేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌కు మద్దతుగా నిలుస్తామని స్పష్టం చేశారు. ‘బెంగాల్‌లో మేము దీదీతోనే ఉన్నాం. ప్రస్తుతానికి భాజపా, కాంగ్రెస్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించాం.  కొత్త ఫ్రంట్‌, గఠ్‌బంధన్‌ లేదా కూటమి.. ఎలా పిలిచినా వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ముందు ఏదో ఒకటి ఏర్పడుతుంది’ అని అఖిలేష్‌ యాదవ్‌ పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఎలాంటి త్యాగానికైనా సిద్ధమేనన్న అఖిలేష్‌.. ఉత్తర్‌ప్రదేశ్‌లో భాజపాను ఓడిస్తే దేశవ్యాప్తంగా ఆ పార్టీని ఓడించవచ్చని అన్నారు.

ఇక కేంద్ర దర్యాప్తు సంస్థలతో విపక్ష నేతలపై కేంద్రం దాడులు చేస్తోందని అఖిలేష్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆమ్‌ఆద్మీ పార్టీ నేత మనీశ్‌ సిసోదియా, ఆర్‌ర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లపై కేసులను ప్రస్తావించిన ఆయన.. ‘భాజపా వ్యాక్సిన్‌’ తీసుకుంటే విపక్ష నేతలపై ఎటువంటి దాడులు ఉండవని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని