Akhilesh Yadav: ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లు ‘సైకిల్‌’వే!

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ .....

Published : 05 Aug 2021 15:53 IST

లఖ్‌నవూ: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా యూపీలోని సమాజ్‌వాదీ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగా గురువారం ఆ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ సైకిల్‌ యాత్ర నిర్వహించారు. సోషలిస్టు నేత దివంగత నేత జ్ఞానేశ్వర్‌ మిశ్రా జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ఈ ర్యాలీలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతు చట్టాలు, నేరాల రేటు పెరుగుదల తదితర అంశాలను లేవనెత్తారు. లఖ్‌నవూలోని పార్టీ కార్యాలయం నుంచి సైకిల్‌ (ఎస్పీ ఎన్నికల గుర్తు) యాత్ర ప్రారంభించడానికి ముందు అఖిలేశ్‌ యాదవ్‌ మీడియాతో మాట్లాడారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ 400 స్థానాలు గెలుచుకుంటుందన్న ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ వచ్చే ఎన్నికల్లో 350 స్థానాలు గెలుస్తామని గతంలో చెప్పా.. కానీ భాజపా పాలనపై ప్రజల ఆగ్రహం చూస్తుంటే 400 సీట్లలో విజయం ఖాయమని చెప్పగలను’ అని వ్యాఖ్యానించారు. ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీలో మొత్తం 403 స్థానాలు ఉండగా.. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎస్పీకి 47 సీట్లు రాగా.. భాజపా, మిత్రపక్షాలు కలిపి 325 స్థానాల్లో విజయదుందుభి మోగించిన విషయం తెలిసిందే. 

కరోనా కట్టడిలోభాజపా ప్రభుత్వం వైఫల్యం చెందిందని మండిపడ్డారు.  కొవిడ్‌ సెకండ్‌వేవ్‌లో మృతిచెందిన వారికి తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ విపత్కర సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులకు కూడా ప్రభుత్వం సాయం చేయలేదని ఆక్షేపించారు. ప్రజలకు ఆక్సిజన్‌, ఔషధాలు కూడా అందుబాటులో ఉంచకుండా వారి చావుకు వారిని వదిలేసిందని ధ్వజమెత్తారు. భాజపా 2017 ఎన్నికల మేనిఫెస్టోను చదవకుండా మనీ ఫెస్టోపై దృష్టి కేంద్రీకరించిందన్నారు. భాజపాలో వర్క్‌ కల్చర్‌లేదన్న అఖిలేశ్‌.. తమ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులకు పేర్లు మార్చడం తప్ప భాజపా ప్రభుత్వం ఈ నాలుగేళ్లలో చేసిందేమీ లేదన్నారు. పిల్లల్లో పోషకాహార లోపం, కస్డడీ మరణాలు, గంగా నదిలో మృతదేహాలను పారవేసే వ్యవహారంలో రాష్ట్రాన్ని భాజపా ప్రభుత్వం తొలి స్థానంలో నిలిపిందని ఆక్షేపించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని