Revanth reddy: పేపర్‌ లీకేజీ కేసు.. సిట్‌ నోటీసులకు భయపడేది లేదు: రేవంత్‌రెడ్డి

2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై సిట్‌ స్పందించింది. దానికి సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ రేవంత్‌ రెడ్డికి సిట్‌ నోటీసులు జారీ చేసింది.

Published : 20 Mar 2023 15:26 IST

హైదరాబాద్‌: తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) పేపర్‌ లీకేజీ కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) (సిట్‌) దర్యాప్తు కొనసాగుతోంది. పేపర్‌ లీకేజీపై ఆరోపణలు చేస్తున్న వారందరికీ సిట్‌ నోటీసులు జారీ చేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి (Revanth reddy) సహా మరికొందరికి సిట్‌ అధికారులు నోటీసులు జారీ చేశారు. 2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయని.. కేటీఆర్‌ ఆఫీస్‌ నుంచే లీకేజీ వ్యవహారం మొత్తం నడిచిందని ఆదివారం రేవంత్‌ రెడ్డి ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించి హైకోర్టులో ఇవాళ వాదనలు వినిపిస్తామని చెప్పారు. ఈ నేపథ్యంలో కేసుకు సంబంధించిన వివరాలు తెలియజేయాలంటూ రేవంత్‌కు సిట్‌ అధికారులు నోటీసులు పంపారు.

సిట్‌ తనకు నోటీసులు జారీ చేయడంపై రేవంత్‌ రెడ్డి స్పందించారు. ‘‘నాకు సిట్‌ నోటీసులు ఇంకా రాలేదు. నోటీసులకు భయపడేది లేదు. లీకేజీ వ్యవహారంపై మా దగ్గర ఉన్న ఆధారాలను సిట్‌కు అందించేది లేదు. సిట్టింగ్‌ జడ్జితో విచారణకు ఆదేశిస్తేనే ఆధారాలు ఇస్తాం. లీకేజీ కేసును కావాలనే నీరుగారుస్తున్నారు. 30 లక్షల మంది నిరుద్యోగులకు అండగా ఉంటాం. సీఎం కేసీఆర్, కేటీఆర్ గద్దె దిగే వరకు పోరాటం ఆపేది లేదు’’ అని రేవంత్‌ వెల్లడించారు.

కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్‌ మాట్లాడారు. ‘‘2016 గ్రూప్‌-1 ఫలితాల్లోనూ అక్రమాలు జరిగాయి. టీఎస్‌పీఎస్సీలోని ఉద్యోగులకు పరీక్షలు రాసే అర్హత లేదు. అలాంటప్పుడు కమిషన్‌లో పనిచేస్తోన్న 20 మంది పరీక్షలు ఎలా రాశారు? అమెరికా నుంచి వచ్చి నేరుగా గ్రూప్-1 రాసిన అమ్మాయికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. టీఎస్‌పీఎస్‌సీ ఉద్యోగికి 4వ ర్యాంక్‌ వచ్చింది. వారిద్దరికీ ఎవరి వల్ల ఉద్యోగాలు వచ్చాయో తేల్చాలి. గ్రూప్‌-2లో ఓకే చోట పరీక్ష రాసిన 25 మందికి ఉద్యోగాలొచ్చాయి. మల్యాల మండలంలో 100 మందికి వందకుపైగా మార్కులు వచ్చాయి. ఈ వ్యవహారంపై సిట్టంగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలి’’ అని రేవంత్ ఆరోపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని