Gujarat Politics: గుజరాత్‌ కొత్త సీఎం రేసులో ఆ నలుగురు..! 

గుజరాత్‌ సీఎం విజయ్‌ రూపానీ అనూహ్య రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత సీఎం రాజీనామా ......

Published : 12 Sep 2021 01:09 IST

అహ్మదాబాద్‌: గుజరాత్‌ సీఎం విజయ్‌రూపానీ అనూహ్య రాజీనామాతో అక్కడి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. వచ్చే ఏడాదిలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ప్రస్తుత సీఎం రాజీనామా చేయడంతో కొత్త ముఖ్యమంత్రి ఎవరనే చర్చ ఊపందుకొంది. ఈ తరుణంలో ప్రధానంగా నలుగురు భాజపా సీనియర్‌ నేతల పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వీరిలో గుజరాత్‌ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌, వ్యవసాయ శాఖమంత్రి ఆర్‌సీ ఫాల్దుతో పాటు కేంద్రమంత్రులుగా ఉన్న పురుషోత్తం రూపాలా, మన్‌సుఖ్‌ మాండవీయ పేర్లు తెరపైకి వచ్చాయి.  ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రిల అమిత్‌ షా స్వరాష్ట్రమైన గుజరాత్‌లో మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ చోటుచేసుకున్న ఈ అనూహ్య పరిణామం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఎలాంటి ప్రత్యేకమైన కారణం చెప్పకుండానే సీఎం విజయ్‌ రూపానీ అకస్మాత్తుగా గవర్నర్‌ను కలిసి తన రాజీనామా లేఖను సమర్పించడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. కొత్త నాయకత్వంలో నూతనోత్సాహం, కొత్త శక్తితో గుజరాత్‌ అభివృద్ధి పథంలో మరింతగా దూసుకెళ్తుందని ఆశిస్తున్నానని.. దీన్ని దృష్టిలో పెట్టుకొనే తన పదవికి రాజీనామా చేసినట్టు ఆయన మీడియాతో అన్నారు.

మోదీ నిర్ణయమే ఫైనల్‌..

నితిన్‌ పటేల్‌, ఫాల్దు, రూపాలా, మాండవీయ పేర్లు చర్చకు వస్తున్నాయని, అయితే, ప్రధాని నరేంద్ర మోదీ దీనిపై నిర్ణయం తీసుకోనుండటంతో కొత్త సీఎం ఎవరో చెప్పడం మాత్రం కష్టమని భాజపా నేత ఒకరు చెప్పినట్టు పీటీఐ వార్తా సంస్థ తెలిపింది. 2016 ఆగస్టులో అప్పటి సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ రాజీనామా చేసిన సందర్భంలో కూడా నితిన్‌ పటేల్‌ తదుపరి ముఖ్యమంత్రి అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే, ఆఖరి నిమిషంలో విజయ్‌రూపానీకి భాజపా అధిష్ఠానం పగ్గాలు అప్పగించింది. మరోవైపు, రూపానీ రాజీనామా అనంతరం నితిన్‌పటేల్‌నే ముఖ్యమంత్రిని చేయాలంటూ సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వస్తున్నాయి. పటేల్ సామాజిక వర్గం వారికే ముఖ్యమంత్రి పీఠం అప్పగించాలన్న డిమాండ్లు వినబడుతున్న తరుణంలో అదే సామాజిక వర్గానికి చెందిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ పేరు కూడా ప్రధానంగా వినిపస్తోంది. మరోవైపు, మహారాష్ట్ర నుంచి వచ్చి గుజరాత్‌లో స్థిరపడిన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సీఆర్‌ పాటిల్‌ను సీఎం పదవికి పరిగణించే అవకాశం లేదని తెలుస్తోంది. 

సరిగ్గా అప్పుడూ ఇలాగే..

2016లో ఆనందిబెన్‌ పటేల్‌ కూడా ఎన్నికలకు ఏడాది ముందే రాజీనామా చేశారు. సరిగ్గా మళ్లీ అదే తరహాలో విజయ్‌ రూపానీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంటుండగానే తన సీఎం పదవికి రాజీనామా చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని