Published : 03 May 2022 01:49 IST

Karnataka: కర్ణాటకలో సీఎం మార్పు..? అమిత్ షా పర్యటన వెనుక ఆంతర్యమేంటి?

బెంగళూరు: కర్ణాటక (Karnataka) లో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు జరగొచ్చనే ప్రచారం జోరందుకుంది. ఇటీవల రాష్ట్రంలో నెలకొన్న పలు వివాదాలు వచ్చే ఏడాది జరగబోయే శాసన సభ ఎన్నికలపై ప్రభావం చూపుతాయన్న ఆందోళనలతో సీఎం బసవరాజు బొమ్మై (Basavaraj Bommai) ను మార్చాలని భాజపా (BJP) అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేడు బెంగళూరుకు వస్తుండటం ఈ ఊహాగానాలను మరింత బలపరుస్తోంది.

ఇటీవల హిజాబ్‌, హలాల్‌, లౌడ్‌ స్పీకర్‌ వంటి వివాదాలు కర్ణాటకను కుదిపేశాయి. దీనికి తోడు ఓ గుత్తేదారు ఆత్మహత్య వ్యవహారంలో రాష్ట్ర మంత్రిపై ఆరోపణలు రావడం బొమ్మై సర్కారును ఇరుకున పడేసింది. 2023లో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ వివాదాలు భాజపాపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని పార్టీ హైకమాండ్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే బొమ్మైను మార్చి ఆయన స్థానంలో మరొకరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని యోచిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఇటీవల పార్టీ జాతీయ సెక్రటరీ బీఎల్‌ సంతోష్‌ చేసిన వ్యాఖ్యలు.. ఈ ఊహాగానాలకు తెరలేపాయి. రాష్ట్ర నాయకత్వంపై నిర్ణయాలు తీసుకునే అధికారం భాజపా అధిష్ఠానానికి ఉందని సంతోష్‌ అన్నారు. గుజరాత్‌లో చేసినట్లుగానే కర్ణాటకలోనూ మార్పులు చేసే అవకాశముందని సూచన ప్రాయంగా వెల్లడించారు. దీంతో బొమ్మై సీటు నుంచి దిగడం ఖాయమని వార్తలు వెలువడుతున్నాయి.

ఆ వార్తలు అవాస్తవం: యడియూరప్ప

అయితే ఈ వార్తలను భాజపా కర్ణాటక వర్గాలు ఖండించాయి. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం లేదని మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత యడియూరప్ప తెలిపారు. బొమ్మై తన బాధ్యతలను గొప్పగా నిర్వర్తిస్తున్నారన్నారు. ‘‘అమిత్ షా రాష్ట్రానికి వస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను తెలుసుకోవాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షా రాష్ట్రంపై దృష్టి పెట్టారు. వచ్చే ఎన్నికల్లో 150 సీట్లను సాధించే దిశగా షా పలు సూచనలు చేయనున్నారు. అంతేగానీ, నాకు తెలిసినంతవరకు రాష్ట్ర నాయకత్వంలో ఎలాంటి మార్పులు ఉండవు’’ అని యడ్డీ చెప్పుకొచ్చారు.

మరోవైపు మరికొద్ది రోజుల్లో కేబినెట్‌ విస్తరణ చేసేందుకు బొమ్మై సిద్ధమవుతున్నారు. దీనిపై ఆయన అమిత్ షా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. తొమ్మది నెలల క్రితమే బొమ్మై కర్ణాటక సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీఎం పదవికి యడియూరప్ప రాజీనామా చేసిన తర్వాత బొమ్మైకు రాష్ట్ర పగ్గాలు అప్పగించారు.

Read latest Politics News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని