Sumalatha: భాజపాలోకి సుమలత.. కర్ణాటక సీఎం ఏం చెప్పారంటే..?

సినీ నటి, ఎంపీ సుమలత (Sumalatha) త్వరలోనే కాషాయ (BJP) కండువా కప్పుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆమె శుక్రవారం ప్రకటన చేయనున్నట్లు సమాచారం.

Published : 09 Mar 2023 19:44 IST

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. కర్ణాటక (Karnataka)లో రాజకీయాలు రోజురోజుకీ ఆసక్తికరంగా మారుతున్నాయి. నేతల పార్టీ మార్పులు, చేరికలతో కన్నడ నాట రాజకీయం వేడెక్కింది. ఈ క్రమంలోనే.. ప్రముఖ నటి, మాండ్య లోక్‌సభ ఎంపీ సుమలత అంబరీశ్ (Sumalatha Ambareesh) భాజపా (BJP)లో చేరనున్నారంటూ ఊహాగానాలు జోరందుకున్నాయి. తాజాగా రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై (Basavaraj Bommai) స్పందిస్తూ.. దీనిపై చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ జరుగుతోందని తెలిపారు.

మాండ్య (Mandya)లో సుమలత శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలోనే భాజపాలో చేరికపై ఆమె ప్రకటన చేసే అవకాశమున్నట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. త్వరలో జరగబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో (Assembly elections) ఆమె మాండ్య జిల్లాలోని ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలున్నట్లు స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. వచ్చే వారం ప్రధాని మోదీ మాండ్యలో రోడ్‌షో నిర్వహించనున్నారు. ఆ ర్యాలీలో సుమలత కూడా పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో పలు చిత్రాలు నటించి ఎంతో ప్రేక్షకాదరణ పొందిన అలనాటి నాయిక సుమలత (Sumalatha).. నాలుగేళ్ల క్రితం రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మాండ్య స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు, మాజీ సీఎం కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై 1.25లక్షలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. దీంతో మాండ్య ఎన్నిక యావత్ దేశం దృష్టిని ఆకర్షించింది. సుమలత భర్త, దివంగత నటుడు అంబరీశ్ గతంలో మాండ్య నుంచి కాంగ్రెస్‌ (Congress) తరఫున ప్రాతినిధ్యం వహించాడు. 2019 ఎన్నికల్లో సుమలత కూడా తొలుత కాంగ్రెస్‌ నుంచి టికెట్‌ ఆశించారు. అయితే, అప్పట్లో ఆ పార్టీ జేడీఎస్‌తో పొత్తు పెట్టుకోవడంతో సీట్ల సర్దుబాటు కింద మాండ్య స్థానం జేడీఎస్‌కు వెళ్లింది. దీంతో అసంతృప్తికి గురైన ఆమె స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు.

కర్ణాటకలో మాండ్య జిల్లా.. జేడీఎస్‌ (JDS)కు కంచుకోట లాంటింది. 2018 ఎన్నికల్లో ఇక్కడి ఏడు స్థానాలను ఆ పార్టీ కైవసం చేసుకుంది. దీంతో ఆ జిల్లాపై దృష్టిపెట్టిన కాషాయ పార్టీ.. 2019లో జరిగిన ఉపఎన్నికలో ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఇప్పుడు సుమలత భాజపాలో చేరితో మాండ్య జిల్లా పోరు మరింత రసవత్తరంగా మారనుంది. కర్ణాటకలో ఏప్రిల్‌-మే నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించే అవకాశముంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని