Mamata: కేసీఆర్‌, స్టాలిన్‌లతో కలిసి కేంద్రంపై పోరాటం: మమత

సమాఖ్య వ్యవస్థను రక్షించేందుకే కేసీఆర్‌, స్టాలిన్‌లతో కలిసి ప్రయత్నాలు చేస్తున్నామని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.

Published : 14 Feb 2022 22:33 IST

సమాఖ్యవ్యవస్థ రక్షణకే పోరాటమన్న పశ్చిమబెంగాల్‌ సీఎం

కోల్‌కతా: పలు అంశాల్లో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ వస్తోన్న ప్రాంతీయ పార్టీలు.. భాజపాను ఎదుర్కొనేందుకు ఒకేతాటిపై వచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఇప్పటికే భాజపాపై పోరును కొనసాగిస్తోన్న మమతా బెనర్జీ, తాజాగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా తెలంగాణ, తమిళనాడు సీఎంలతో ఇటీవలే మాట్లాడినట్లు వెల్లడించారు. ముఖ్యంగా అణచివేతకు గురవుతున్న సమాఖ్య వ్యవస్థను రక్షించేందుకే మేమందరం కలిసి ప్రయత్నాలు చేస్తున్నామని బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు. కోల్‌కతాలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన ఆమె.. పలు అంశాలపై క్లారిటీ ఇచ్చారు.

అందుకే యూపీలో పోటీ చేయట్లేదు..

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా సమాజ్‌వాదీ పార్టీకి మద్దతుగా మమతా బెనర్జీ ఇటీవల ప్రచారం నిర్వహించారు. ఏ అసెంబ్లీ స్థానంలోనూ అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ బలహీనం కావద్దొనే ఉద్దేశంతోనే అక్కడ పోటీకి దిగలేదన్నారు. ముఖ్యంగా జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని యూపీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించామని చెప్పారు. ఇక తొలిదశ ఎన్నికల్లో భాగంగా అఖిలేశ్‌ యాదవ్‌ పార్టీ 37 స్థానాల్లో గెలుపొందుతుందని మమతా బెనర్జీ జోస్యం చెప్పారు.

ఇక యూపీ సీఎం యోగీ ఆదిత్యానాథ్‌ పాలనపై మమతా బెనర్జీ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘రైతులు హత్యలకు గురవుతున్నారు. మహిళలను బతికుండగానే కాల్చివేస్తున్న సంఘటనలు అక్కడ చోటుచేసుకుంటున్నాయి. ఆయన యోగీ కాదు ఆయనో భోగి. దేశాన్ని రక్షించాలంటే ముందు ఉత్తర్‌ప్రదేశ్‌ను కాపాడాలి’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. మార్చి 3వ తేదీన యూపీలో మరోసారి పర్యటిస్తానని అన్నారు.

కాంగ్రెస్‌ దారి అదైతే.. మా దారి మాదే

తమ పార్టీతో ఏ ప్రాంతీయ పార్టీ కూడా సత్సంబంధాల కోసం ప్రయత్నాలు చేయలేదని కాంగ్రెస్‌ పార్టీ చెప్పుకోవడం పట్ల టీఎంసీ అధినేత మమతా బెనర్జీ మండిపడ్డారు. ‘ప్రతిఒక్కరిని ఒకే వేదికపైకి తీసుకురావడం సెక్యులర్‌ పార్టీ అని చెప్పుకునే వారి బాధ్యత. కాంగ్రెస్‌, సీపీఐ(ఎం)ను చేతులు కలపమని వారిని అడిగాను. ఈ విషయంలో చెప్పింది వినకపోతే నేను చేసేదేం లేదు’ అని మమతా బెనర్జీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వాళ్ల దారిలో వెళితే.. మా దారిలో మేం వెళ్తాం’ అని మమతా బెనర్జీ స్పష్టం చేశారు. దుర్మార్గపు చర్యల నుంచి దేశాన్ని విముక్తి చేయాలంటే ఇదే సరైన సమయం అని బెంగాల్‌ సీఎం అభిప్రాయపడ్డారు.

రాజ్యాంగాన్ని బలహీన పరుస్తూ.. భారత్‌ అధ్యక్ష తరహా ప్రభుత్వం వైపు పయనిస్తోందని మమతా బెనర్జీ వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‌లతో సంప్రదింపులు జరిపానన్న ఆమె.. దేశ సమాఖ్య వ్యవస్థను రక్షించేందుకు మేమందరం ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని