శారదా పీఠానికి కేటాయించిన ఆ 15 ఎకరాలు రద్దు చేయాలి: శ్రీనివాసానంద సరస్వతి

శారద పీఠానికి వైకాపా ప్రభుత్వం కొత్తవలసలో కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు.

Published : 02 Jul 2024 14:15 IST

విశాఖపట్నం: శారద పీఠానికి వైకాపా ప్రభుత్వం కొత్తవలసలో కేటాయించిన 15 ఎకరాలకు పైగా భూ కేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధు పరిషత్తు అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి కోరారు. ఆయన నేతృత్వంలోని బృందం భూమి కేటాయించిన కొండ ప్రాంతాన్ని పరిశీలించింది. జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, హిందూ సంస్థల ప్రతినిధులు ఈ పరిశీలనలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా శ్రీనివాసానంద సరస్వతి మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం కొండను చౌకగా శారదా పీఠానికి కట్టబెట్టిందని ఆరోపించారు. ‘‘వాణిజ్య కార్యకలాపాల కోసం కోరినా అనుమతి ఇచ్చారు. పూర్తిగా వ్యాపార ధోరణితో ఇది జరగడం, కొండ వినియోగానికి అనుమతించడం దారుణం. కూటమి ప్రభుత్వం ఆ అనుమతులు రద్దు చేయాలి. చారిత్రక ఆనవాలుగా ఉండే కొండను పరిరక్షించాలి’’ అని డిమాండ్‌ చేశారు.

శారదా పీఠానికి భూ కేటాయింపులు రద్దు చేయాలని పీతల మూర్తి యాదవ్‌ కోరారు. ‘‘వైకాపా క్యాంపు కార్యాలయంలా శారదా పీఠం పనిచేసేది. కొత్తవలసలో విలువైన కొండను కేటాయించడం దారుణం. వేదపాఠశాల పెడతామని భూమి కేటాయించుకున్నారు. స్థిరాస్తి వ్యాపారానికి అనుమతి ఇవ్వాలని దరఖాస్తు చేయడం హేయం. చారిత్రక ఆధారాలను కూటమి ప్రభుత్వం కాపాడుతుంది. శారదా పీఠానికి 2019కి ముందున్న ఆస్తులు ఎంత? ఇప్పుడు బినామీలకు ఉన్న ఆస్తులెంత? అనే లెక్కలు తేల్చాలి’’ అని అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని