Liquor scam: ఆ లిక్కర్‌ స్కాం ఏంటో ఇప్పటికీ అర్థంకాలేదు: కేజ్రీవాల్‌

దేశ రాజధాని దిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం(Liquor scam) దేశంలోని అనేకచోట్ల ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా......

Updated : 02 Nov 2022 11:38 IST

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో వెలుగు చూసిన మద్యం కుంభకోణం(Liquor scam) దేశంలోని అనేకచోట్ల ప్రకంపనలు రేపుతోంది. దీనిపై ఈడీ అధికారులు దేశవ్యాప్తంగా పలుచోట్ల సోదాలు కొనసాగిస్తున్న నేపథ్యంలో దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) కీలక వ్యాఖ్యలు చేశారు. మద్యం కుంభకోణం ఏమిటో తనకు ఇప్పటికీ అర్థం కావడంలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సీబీఐ, ఈడీలతో అనునిత్యం అందరినీ వేధించడానికి బదులుగా దేశ ప్రగతి కోసం ఏదైనా సానుకూలమైన పనులు చేయాలని సూచించారు. దిల్లీలోని ఆప్‌ సర్కార్‌ తీసుకొచ్చిన మద్యం పాలసీ 2021-22 అమలులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై ఈడీ అధికారులు దేశ వ్యాప్తంగా 40 చోట్ల ఈడీ సోదాలు చేపట్టిన నేపథ్యంలో ఆయన దిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏదైనా తప్పు జరిగినట్టు సోమవారంలోగా తేలితే సిసోడియాను అరెస్టు చేయండి.. లేకపోతే క్షమాపణలు చెప్పాలన్నారు.  

‘‘ఈ మద్యం కుంభకోణం ఏంటో నాకు ఇప్పటివరకు అర్థంకాలేదు. భాజపా నేతల్లో ఒకరు ఈ కుంభకోణం రూ.1.5లక్షల కోట్లు అన్నారు. దిల్లీ మొత్తం బడ్జెట్టే రూ.70వేల కోట్లు అయితే.. ఈ స్కామ్‌ రూ.1.5లక్షల కోట్లు ఎలా అవుతుంది? ఆ పార్టీకి చెందిన మరో నేత రూ.8వేల కోట్ల కుంభకోణం అంటే.. ఇంకొకరేమో రూ.1100 కోట్ల స్కాం అటున్నారు. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రూ.144 కోట్ల కుంభకోణమని చెబుతుండగా.. సీబీఐ అధికారులేమో రూ.కోటి కుంభకోణం జరిగిందంటున్నారు. డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా ఇంట్లో సీబీఐ దాడులు జరిపింది. ఆయన లాకర్‌తో పాటు సిసోడియా గ్రామంలోకి వెళ్లి విచారణ జరిపినా మద్యం పాలసీలో ఒక్క పైసా కూడా అక్రమం జరిగినట్టు బయటపడలేదు. అందువల్ల, ఇక్కడ కుంభకోణం ఎక్కడుంది?’’ అని కేజ్రీవాల్‌ ప్రశ్నించారు.

‘‘కేంద్ర ప్రభుత్వం రాత్రింబవళ్లూ సీబీఐ, ఈడీతో కాలక్షేపం చేయకుండా దేశానికి సానుకూలంగా కొంత పనిచేయాలి. అలాకాకుండా సీబీఐ, ఈడీలతో అందరినీ బెదిరిస్తుంటే ఈ దేశం ఎలా పురోగమిస్తుంది? ఏదైనా తప్పు జరిగితే ఎవరినైనా పట్టుకొనే స్వేచ్ఛ కేంద్రానికి ఉంది. కానీ అనవసరంగా దర్యాప్తు సంస్థలను వాడుకొని ప్రతిఒక్కరినీ భయభ్రాంతులకు గురిచేస్తుంటే దేశ ప్రగతి కుంటుపడుతుంది. దిల్లీలో ఆప్‌ సర్కార్‌ మాదిరిగా స్కూళ్లు వంటి సానుకూల అంశాలపై కేంద్రం దృష్టిపెట్టాలి’’ అని సూచించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని