Gujarat polls: సూరత్‌లో కేజ్రీవాల్‌ రోడ్‌ షోపై రాళ్ల దాడి!

గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat election 2022) పోలింగ్‌కు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార వేడిని పెంచుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సూరత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 29 Nov 2022 01:37 IST

సూరత్‌: గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల(Gujarat election 2022) పోలింగ్‌కు గడువు సమీపిస్తుండటంతో రాజకీయ పార్టీలు ప్రచార వేడిని పెంచుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం ఆప్‌ జాతీయ కన్వీనర్‌, దిల్లీ సీఎం అర్వింద్‌ కేజ్రీవాల్‌(Arvind Kejriwal) సూరత్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయన ర్యాలీ ఓ వీధిని దాటుతుండగా గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడి చేసినట్టు వార్తలు వచ్చాయి.ఈ ఘటన అనంతరం కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. గత 27 ఏళ్లలో గుజరాత్‌ ప్రజలకు భాజపా ప్రభుత్వం ఏమీ చేయలేదని ఆరోపించారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా ద్రవ్యోల్బణం, నిరుద్యోగ సమస్య ఉందని విరుచుకుపడ్డారు. భాజపానే తమపై రాళ్లు దాడి జరిపిందని ఆరోపించారు.  నిజంగా గత 27ఏళ్లలో ఏదైనా పనిచేసి ఉంటే ఇప్పుడు తమపై రాళ్లు రువ్వాల్సిన అవసరం ఉండేది కాదన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 182 సీట్లకు గాను తాము 92కు పైగాస్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తంచేశారు. మహిళలు, యువత భాజపాకు భయపడి బయటకు చెప్పలేకపోయినా వారంతా తమకే ఓటు వేస్తారన్నారు. 

ఇంకోవైపు, ఈ ఘటనపై ఆప్‌ అభ్యర్థి అల్పేశ్‌ కత్రియా స్పందించారు.   కేజ్రీవాల్‌పై జనం పూలు విసురుతుంటే.. భాజపా గూండాలు రాళ్లు రువ్వారని ఆరోపించారు. ఈ ఘటనపై ఆప్‌ గుజరాత్‌ చీఫ్‌ గోపాల్‌ ఇటాలియా కూడా స్పందించారు. కాటరగాన్‌ అసెంబ్లీ సీటులో ఓడిపోతారన్న భయంతోనే రాళ్ల దాడికి దిగారన్నారు. ఈ ఘటనలో ఓ చిన్నారికి గాయమైనట్టు తెలిపారు. గుజరాత్‌లో డిసెంబర్‌ 1న జరగబోయే తొలి విడత ఎన్నికలకు ప్రచార గడువు మంగళవారంతో ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని