Assembly Elections: ఒక్క ఛాన్స్‌ ఇవ్వండి..!: ఆమ్‌ఆద్మీ

ఉత్తరాఖండ్‌లో కాంగ్రెస్‌, భాజపా మధ్య అధికార మార్పిడి ఓ కుర్చీలాటగా మారిందని ఆప్‌ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా పేర్కొన్నారు.

Published : 11 Jan 2022 01:26 IST

ఉత్తరాఖండ్‌లో భాజపా, కాంగ్రెస్‌కు స్వస్తి పలకాలని పిలుపు

దిల్లీ: ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు షెడ్యూల్‌ వెలువడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లో ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆప్‌ నేత, దిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా.. కాంగ్రెస్‌, భాజపా మధ్య అధికార మార్పిడి ఓ కుర్చీలాట మాదిరిగా మారిందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి రాష్ట్రం బయటపడాలంటే వచ్చే ఎన్నికల్లో ఇటువంటి విధానానికి స్వస్తి చెప్పాలని పిలుపు నిచ్చారు. అందుకే ఆమ్‌ఆద్మీ పార్టీకి ఒక అవకాశం కల్పించాలని ఉత్తరాఖండ్‌ ప్రజలకు మనీష్‌ సిసోడియా విజ్ఞప్తి చేశారు.

‘రాష్ట్రం ఏర్పడి 21ఏళ్లు అయ్యింది. కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడే లక్ష్యాన్ని సాధించడంలో మాత్రం విఫలమైంది. ఉత్తరాఖండ్‌లో ఓసారి భాజపా, మరోసారి కాంగ్రెస్‌ పార్టీలు వరుసగా అధికారాన్ని చేపడుతున్నాయి. కానీ, అభివృద్ధిలో ఏమాత్రం పురోగతి చూపించలేదు. వలసలు, పాఠశాలల లేమి, ఆస్పత్రులు 21ఏళ్ల క్రితం ఎలా ఉన్నాయో ఇప్పుడూ అదే పరిస్థితుల్లో ఉన్నాయి’ అంటూ ఉత్తరాఖండ్‌ ప్రచారంలో ఆప్‌ నేత మనీష్‌ సిసోడియా విమర్శించారు. ఇలా కాంగ్రెస్‌, భాజపా మధ్య అధికార మార్పిడి ఓ కుర్చీలాటగా మారిందని దుయ్యబట్టారు. అందుకే దిల్లీ మాదిరిగా రాష్ట్రంలో అభివృద్ధి సాధించాలంటే ఆ రెండు పార్టీలకు స్వస్తి చెప్పి ఆమ్‌ఆద్మీ పార్టీకి ఓ అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. మొత్తం ఏడు విడతల్లో పోలింగ్‌ జరగనుండగా.. ఫిబ్రవరి 14వ తేదీన ఉత్తరాఖండ్‌లో పోలింగ్‌ జరుగనుంది. అయితే, దేశవ్యాప్తంగా కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో వర్చువల్‌ విధానంలో ఎన్నికల ప్రచారానికి ఆయా పార్టీలు సన్నద్ధమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని