వెండితెర నుంచి రాజకీయ బరిలోకి!

సినిమాది, రాజకీయానిది విడదీయరాని బంధం. ముఖ్యంగా దక్షిణాదిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాల్లో అశేష ప్రేక్షకాదరణ పొంది అదే స్థాయిలో రాజకీయాల్లోకి.....

Published : 04 Dec 2020 01:52 IST

తమిళనాట కొనసాగుతున్న సినీ రాజకీయం

ఇంటర్నెట్‌డెస్క్‌: సినిమాది, రాజకీయానిది విడదీయరాని బంధం. ముఖ్యంగా దక్షిణాదిలో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాల్లో అశేష ప్రేక్షకాదరణ పొంది అదే స్థాయిలో రాజకీయాల్లోకి వచ్చి సత్తా చాటిన వారు ఇక్కడ కనిపిస్తారు. తమిళనాడు విషయానికొస్తే ఈ పరిస్థితి మరింత ఎక్కువ. ఇప్పటి వరకు తమిళనాడును పాలించిన ఏడుగురు ముఖ్యమంత్రుల్లో ఐదుగురు సినీ నేపథ్యంలో ఉన్నవారే కావడం గమనార్హం. దీని బట్టి ఇక్కడి పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. తాజాగా రజనీకాంత్‌ రూపంలో మరో సినీనటుడు రాజకీయాల్లోకి అడుగుపెడుతుండడంతో ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఇంతకీ తమిళ సినిమాకు, రాజకీయాలకు అంతగా బంధం పెనవేసుకోవడానికి గల కారణమేంటి? అలా రాజకీయాల్లోకి వచ్చి విజయం సాధించిన వారెవరు? ఎంట్రీకే పరిమితమైన వారెవరో ఇప్పుడు ఓ సారి చూద్దాం..!

దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే తమిళనాడుది ప్రత్యేక శైలి. తమిళ భాషకు, సంస్కృతికి పెద్దపీట వేస్తారిక్కడి ప్రజలు. వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాలే నడిచాయిక్కడ. అప్పటి వరకు పౌరాణిక చిత్రాలకే పరిమితమైన తమిళ సినిమా కూడా ద్రవిడ ఉద్యమానికి వేదికైంది. పెరియార్‌ ఈవీ రామస్వామి ఆలోచనలను జనాల్లోకి చేరవేయడంలో సినిమా రంగం ప్రముఖ పాత్ర పోషించింది. అలా 1952లో వచ్చిన ఓ చిత్రం అక్కడి రాజకీయాలను మలుపుతిప్పింది. ‘పరాశక్తి’ పేరిట వచ్చిన చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకుంది. ఈ చిత్రం ద్వారానే శివాజీ గణేశన్‌, ఎస్‌ఎస్‌ రాజేంద్రన్‌ వంటి నటులు తెరంగేట్రం చేయగా.. కరుణానిధి ఈ చిత్రానికి స్క్రిప్ట్‌ అందించారు. అనంతర కాలంలో వీరంతా తమిళ రాజకీయాలపై ప్రభావం చూపిన వారే. ఒక దశలో ఈ సినిమాకు అడ్డుకోవాలని అప్పటి రాష్ట్ర ప్రభుత్వం చూసిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. పెరియార్‌ రామస్వామి ఆలోచనలను జనాల్లోకి తీసుకెళ్లడంలో అన్నాదురై వంటి వారు కృషి చేసి ప్రజల మన్ననలను పొందారు. అనంతరం కాలంలో రాజకీయాల్లో విజయం సాధించారు.

ద్రవిడ ఉద్యమం టూ సీఎం పీఠం

ద్రవిడ ఉద్యమంలో భాగంగా సినిమాలకు స్క్రిప్ట్‌ రైటర్లుగా వ్యవహరించిన అన్నాదురై, కరుణానిధి అనంతరం కాలంలో డీఎంకే తరఫున ముఖ్యమంత్రులుగా వ్యవహరించారు. 1969లో అన్నాదురై ముఖ్యమంత్రి పీఠం అధిష్ఠించిన కొద్ది కాలానికే ఆయన కన్నుమూయడంతో కరుణానిధి సీఎం పీఠం ఎక్కారు. శివాజీ గణేశన్‌ సైతం తొలినాళ్లలో డీఎంకేలో ఉన్నప్పటికీ పెద్దగా పేరు సంపాదించలేకపోయారు. అదే సమయంలో ఎంజీఆర్‌కు పార్టీలో పేరు ప్రఖ్యాతలు పెరుగుతుండడంతో డీఎంకేను వీడారు. ద్రవిడ ఉద్యమంలో భాగస్వామిగానే కాక పేదల పక్షపాతిగా పేరొందిన ఎంజీఆర్‌ విధానాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు. అవి డీఎంకే విజయంలో కీలక పాత్ర పోషించాయి. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి తన కుమారుడు ఎంకే ముత్తుకు పార్టీలో పెద్ద పీట వేయడం ఎంజీఆర్‌కు నచ్చలేదు. దీంతో ఆయన 1972లో అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏడీఎంకే) పేరిట పార్టీని స్థాపించారు. అనంతరం దాన్ని ఆల్‌ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కళగం (ఏఐఏడీఎంకే)గా మార్చారు. 1980 ఎన్నికల్లో ఆయన ఆ పార్టీ విజయం సాధించింది. 1987 వరకు ఎంజీఆర్‌ మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఆయన మరణానంతరం జానకీ రామచంద్రన్‌ కొద్దిరోజులు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అనంతరం ఏఐఏడీఎంకే జయలలిత, జానకీ రామచంద్రన్‌ (ఇద్దరికీ సినీ నేపథ్యం ఉంది) వర్గాలుగా విడిపోయింది. దీంతో తర్వాత ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమి పాలైంది. అనంతరం 1991లో తొలిసారి జయలలిత ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టారు. అలా అప్పటి నుంచి అధికార పీఠం డీఎంకే, ఏఐఏడీఎంకే మధ్య చేతులు మారుతూ వస్తోంది.

పార్టీలు పెట్టినా..!
తమిళనాట సినీ రంగం నుంచి వచ్చిన ఎంతో మంది పార్టీ పెట్టినప్పటికీ తొలితరం చూపినంత ప్రభావం చూపలేకపోయారు. కెప్టెన్‌ విజయ్‌ కాంత్‌ డీఎండీకే పేరిట 2005లో పార్టీ ప్రారంభించారు. 2006 ఎన్నికల్లో జరిగిన ఎన్నికల్లో 10 శాతం ఓట్లు సాధించారు.  2011లో ఏఐఏడీఎంతో చేతులు కలిపి 41 స్థానాల్లోపోటీ చేసి 29 సీట్లు సాధించింది. తర్వాతి కాలంలో తమిళ రాజకీయాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. కమల్‌ హాసన్‌ సైతం మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) పార్టీని స్థాపించారు. 2021 ఎన్నికల్లో సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. శరత్‌ కుమార్‌, టి.రాజేంద్ర వంటి వారు పార్టీలు పెట్టినప్పటికీ పెద్దగా ప్రజలకు చేరువకాలేకపోయారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ కొత్తగా పార్టీ పెట్టి రాజకీయాల్లోకి రాబోతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు సన్నద్ధమవుతున్నారు. కరుణానిధి, జయలలిత మరణానంతరం తమిళనాట ఏర్పడిన రాజకీయ శూన్యతను భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని