JP Nadda: రాజకీయాల్లో నేడు విచిత్రాలు జరుగుతున్నాయి.. జేపీ నడ్డా

JP Nadda: పట్నాలో విపక్షాల భేటీపై భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా విమర్శలు చేశారు. రాజకీయాల్లో నేడు వింతలు చూస్తున్నామంటూ వ్యాఖ్యానించారు.

Updated : 23 Jun 2023 17:33 IST

భవానిపట్న(ఒడిశా): బిహార్‌ రాజధాని పట్నాలో విపక్ష పార్టీలు భేటీ(opposition meeting) కావడంపై  భాజపా(BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) స్పందించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్‌ గాంధీ(Rahul Gandhi)కి ఆహ్వానం పలుకుతున్నారని విమర్శించారు. బిహార్‌ సీఎం నీతీశ్ కుమార్‌ (Nitish kumar)ఆధ్వర్యంలో విపక్ష పార్టీల భేటీ జరగ్గా.. ఇందులో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో సహా పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ఒడిశాలోని కలహండి జిల్లా భవానీపట్నలో జరిగిన బహిరంగ సభలో నడ్డా మాట్లాడుతూ.. విపక్షాల భేటీపై విమర్శల దాడి చేశారు.  ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి నేతలుగా ఉన్న లాలూ, నీతీశ్‌.. జయప్రకాశ్ నారాయణ్‌ సారథ్యంలో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పాల్గొని అరెస్టయ్యారన్నారు. లాలూప్రసాద్‌ యాదవ్‌ 22 నెలలు జైలులో ఉండగా.. నీతీశ్‌ కూడా 20 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. రాజకీయాల్లో నేడు విచిత్ర ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో జైలుకు వెళ్లిన నేతలే ఇప్పుడు ఆమె మనవడు రాహుల్‌ గాంధీతో చేతులు కలుపుతున్నారన్నారని ఆక్షేపించారు. 

‘‘విపక్షాల భేటీలో పాల్గొనేందుకు ఉద్ధవ్‌ ఠాక్రే పట్నాకు రావడం చూశా. ఆయన తండ్రి ‘హిందూ హృదయ్‌ సామ్రాట్‌’ బాలాసాహెబ్‌ ఠాక్రే కాంగ్రెస్‌ను ఎప్పుడూ వ్యతిరేకించేవారు.  కాంగ్రెస్‌లో చేరడం కంటే 'దుకాణ్‌' (తన పార్టీ శివసేనను ఉద్దేశించి) మూసివేయడం మంచిదని ఓసారి బాలాసాహెబ్‌ అన్నారు. ఇప్పుడు ఆయన తనయుడు ఉద్ధవ్‌ ఠాక్రే ‘దుకాణ్‌’ను మూసివేస్తున్నారు’’ అని విమర్శించారు.  ప్రపంచ నేతలు ప్రధాని నరేంద్ర మోదీని కీర్తిస్తుంటే కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని మండిపడ్డారు. వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించిన ప్రధాని నరేంద్ర మోదీ.. అభివృద్ధి రాజకీయాలను దేశానికి పరిచయం చేశారన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని