Congress Presidential Election: అధ్యక్ష పదవి రేసులో గహ్లోత్‌, థరూర్‌.! ఎవరి బలమెంత?

ఓ వైపు రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పటికీ.. అక్టోబర్‌ 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. ఇప్పటికే సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ నామినేషన్‌ సమర్పించగా.. మరోవైపు గహ్లోత్‌ అధ్యక్ష పదవి బరిలో నిలుస్తారా?లేదా? అనేదానిపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం ఆయన్ను బరిలోకి దించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది..

Published : 27 Sep 2022 18:43 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఒక పక్క రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నప్పటికీ.. అక్టోబర్‌ 17న అధ్యక్ష ఎన్నికలు నిర్వహించేందుకు ఆ పార్టీ సిద్ధమవుతోంది. సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ ఈనెల 30న నామినేషన్‌ సమర్పించనున్నారు. మరోవైపు గహ్లోత్‌ అధ్యక్ష పదవి బరిలో నిలుస్తారా?లేదా? అనేదానిపై ఇంకా సందిగ్ధత వీడలేదు. అయితే కాంగ్రెస్‌ అధిష్ఠానం మాత్రం ఆయన్ను బరిలోకి దించేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆ ఇద్దరి బలాబలాలేంటో ఓ సారి చూద్దామా?

అదే శశి థరూర్‌ బలం

శశి థరూర్‌ వరుసగా మూడు పర్యాయాలు తిరువనంతపురం లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. సామాన్య, మధ్యతరగతి వర్గానికి చెందిన ప్రజల అభిమానాన్ని చూరగొంటున్నారు. అందర్నీ ఆకట్టుకునే స్వభావం ఈయన సొంతం. క్లిష్ట పరిస్థితులు ఎదురైప్పుడు తార్కికంగా ఆలోచించి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. అంతర్జాతీయంగానూ శశి థరూర్‌కు మంచి గుర్తింపు ఉంది. ఐక్యరాజ్య సమితిలో పని చేసిన అనుభవం ఉంది. గతంలో మంత్రిగానూ సేవలందించారు.

గాంధీల మద్దతు కరవయ్యేనా..?

కాంగ్రెస్‌ పార్టీలో వ్యవస్థాగత మార్పులు అవసరమంటూ అధిష్ఠానంపై తిరుబాటు చేసి, అధినేత్రి సోనియా గాంధీకి లేఖలు రాసిన 23 మంది నేతలల్లో శశి థరూర్‌ కూడా ఉన్నారు. తాజా ఎన్నికల్లో ఇది ఆయనకు కాస్త ఇబ్బంది పెట్టే అంశమే. గాంధీ కుటుంబం మద్దతు ఉండకపోవచ్చు. అంతేకాకుండా పార్టీలో ఈయన కన్నా సీనియర్‌ నేతలు చాలా మంది ఉన్నారు. ఇతరులతో పోల్చుకుంటే పార్టీలో ఈయన జూనియర్‌ (2009లో  పార్టీలో చేరారు). సంస్థాగత అనుభవం లేదు. హిందీలో అనర్గళంగా మాట్లాడలేరు.

అశోక్‌ గహ్లోత్‌ ప్రధాన బలం అదే

రెండు పర్యాయాలు రాజస్థాన్‌ ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవం అశోక్‌ గహ్లోత్‌కు కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికల్లో ప్రధాన బలంగా మారనుంది. 1998-2003, ఆ తర్వాత 2008-2013 మధ్య కాలంలో ముఖ్యమంత్రిగా సేవలందించిన ఆయన.. ప్రస్తుతం కూడా సీఎంగా కొనసాగుతున్నారు. రాజకీయరంగంలో దాదాపు 50 ఏళ్ల అనుభవముంది. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, పీవీ నర్సింహారావు హయాంలోనూ కేంద్ర మంత్రిగా పని చేసిన అనుభవం ఆయన సొంతం. కాంగ్రెస్‌లో మార్పులు అనివార్యమంటూ అధిష్ఠానానికి లేఖలు రాసిన పార్టీ నేతల్లో అశోక్‌ గహ్లోత్‌ లేరు. అంతేకాకుండా అలా రాయడాన్ని ఈయన తీవ్రంగా వ్యతిరేకించారు. వీటన్నింటికీ తోడు ప్రస్తుతం గాంధీ కుటుంబీకుల మద్దతు ఆయనకు పుష్కలంగా ఉంది.

వయోభారం వెనక్కి లాగుతోంది

గాంధీ కుటుంబ సభ్యుల అండదండలు ఉన్నప్పటికీ అశోక్‌ గహ్లోత్‌కు వయోభారం ప్రధాన సమస్యగా మారింది. 70 ఏళ్లకు పైగా వయసున్న ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే న్యాయం చేస్తారో? లేదో ?అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వస్తే సచిన్‌పైలట్‌కు ఆ స్థానాన్ని ఇస్తామనడాన్ని గహ్లోత్‌ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాజా పరిస్థితుల్లో ఆయన్ను అధ్యక్ష పదవి రేసు నుంచి తప్పించాలన్న డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి. ఇది ఆయనకు వ్యతిరేక అంశమే. గహ్లోత్‌ ఫక్తు రాజకీయవేత్త అయినప్పటికీ ఇటీవల ఓటర్లను ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో సచిన్‌ పైలట్‌ వల్లే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ.. కొన్ని రాజకీయ సమీకరణాల నేపథ్యంలోనే గహ్లోత్‌కు సీఎం పదవి ఇచ్చినట్లు సొంతపార్టీ నేతలే చెబుతున్నారు.

వీరిద్దరితోపాటు అధ్యక్షపదవి రేసులో పార్టీ సీనియర్‌ నేతలు ముకుల్‌ వాస్నిక్‌, మల్లిఖార్జున ఖర్గే, దిగ్విజయ్‌ సింగ్‌, కేసీ వేణుగోపాల్‌ పేర్లు కూడా వినిపిస్తున్నప్పటికీ వీరంతా సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. ప్రధాన పోటీ గహ్లోత్‌-శశిథరూర్‌ మధ్యే ఉన్న నేపథ్యంలో గాంధీ కుటుంబం అండతో గహ్లోత్‌ అధ్యక్ష పదవిని అలంకరిస్తారా?అంచనాలను తలకిందులు చేస్తూ థరూర్‌ ఆ స్థానాన్ని గెలుచుకుంటారో చూడాలి మరి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని