అనవసరంగా మొట్టికాయలు తింటున్నారు: సుజనా

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని తరలింపులో కేంద్రానికి పాత్ర ఉందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పాత్ర ఉందనే రాజధాని రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. ఏపీ పరిస్థితులపై సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం

Updated : 30 Jul 2020 19:39 IST

ఏపీ ప్రభుత్వం తీరుపై భాజపా ఎంపీ విమర్శలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని తరలింపులో కేంద్రానికి పాత్ర ఉందని కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరి అభిప్రాయపడ్డారు. కేంద్రం పాత్ర ఉందనే రాజధాని రైతులకు పన్ను మినహాయింపు ఇచ్చారని చెప్పారు. ఏపీ పరిస్థితులపై సుజనా చౌదరి మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. ఎస్‌ఈసీ కేసులో ప్రభుత్వం పిచ్చుకపై బ్రహ్మాస్త్రం ప్రయోగిస్తోందని చెప్పారు. అనవసరంగా కోర్టుతో మొట్టికాయలు తింటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం తీరుతో ఈ ఏడాది ఒక్క ప్రాజెక్టు కూడా ముందుకెళ్లలేదన్నారు. ప్రభుత్వం మారిందని ఇప్పటికే ఉన్న చట్టాలన్నీ మారిపోవని, రాజధాని విషయంలో ప్రజలకు ఆందోళన అవసరం లేదని ఎంపీ సుజనా చౌదరి తెలిపారు.

‘‘భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైకాపా....రాష్ట్ర అభివృద్ధి, మెరుగైన పాలనపై దృష్ఠి సారించాలి. రాజధాని వికేంద్రీకరణ బదులు పాలన వికేంద్రీకరణ జరగాలి. రాజధానులు పెంచుకుంటూ పోవడం సరికాదు. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 5,6కు విరుద్ధంగా రాజధాని విభజన అంశాన్ని ప్రభుత్వం గవర్నర్‌ వద్దకు తీసుకెళ్లింది. గవర్నర్‌ న్యాయ సమీక్షకు పంపకుండా, రాజ్యాంగానికి విరుద్ధంగా ఏ నిర్ణయం తీసుకోరు. కౌన్సిల్‌ ఆమోదించకుండా రాజధాని విభజన బిల్లును గవర్నర్‌కి పంపడమే రాజ్యాంగ విరుద్ధం. అసలు రాజధాని మార్పు ఫైల్‌ ఎక్కడ ఉందో అర్థం కాని పరిస్థితి. సెలెక్ట్‌ కమిటీ ఆమోదించిందా లేదా అనేది కూడా తెలియడం లేదు. అయినా రాజ్యాంగంలో రాష్ట్ర రాజధాని అంశంపై కేంద్ర ప్రభుత్వానిదే తుది నిర్ణయం. అమరావతిని రాజధానిగా సర్వే ఆఫ్‌ ఇండియా కూడా గుర్తించింది. రాజ్యసభ్య ఎంపీగా చెబుతున్నా కేంద్రం సరైన సమయంలో జోక్యం చేసుకొని సరైన నిర్ణయం తీసుకుంటుంది’’అని సుజనా చౌదరి తెలిపారు.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు నియామకంపై ఎంపీ సుజనా స్పందిస్తూ.. ఏపీ భాజపా అధ్యక్షుడిగా ఆయన నియామకం సంతోషంగా ఉందన్నారు. పార్టీని అధికారం వైపు తీసుకెళ్తారని నమ్ముతున్నానని చెప్పారు. 

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని