UP Elections: భాజపాకున్న మద్దతు చూసి.. కొందరికి కలలో కృష్ణుడు కనిపిస్తున్నాడు: మోదీ

ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన పలు భాజపా ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని దోచుకోవడమే ఎజెండాగా పాలన

Published : 07 Feb 2022 01:36 IST

లఖ్‌నవూ: ఉత్తరప్రదేశ్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన పలు భాజపా ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలను పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా పాలన సాగించారని విమర్శలు గుప్పించారు. 

మధుర, ఆగ్రా, బులంద్‌షెహర్‌ప్రాంతాల్లో పర్యటనల సందర్భంగా మోదీ మాట్లాడుతూ‘‘గతంలో అధికారంలో ఉన్న నేతలు ప్రజల విశ్వాసాన్ని పొందలేదు. వారి అవసరాలను తీర్చలేదు. రాష్ట్రాన్ని దోచుకోవడమే అజెండాగా పెట్టుకున్నారు. అయితే, గత ఎన్నికల్లో ప్రజలు వారికి తగిన బుద్ధి చెప్పారు. అర్థబలం, కండబలం, కులం, మతం ప్రాతిపదికన కొందరు ఎన్ని రాజకీయాలు చేసినా ప్రజల ప్రేమను పొందలేరని యూపీ ప్రజలు నిరూపించారు. ఎవరైతే సేవకుడిగా మారి ప్రజాసేవ చేస్తారో వారికే ప్రజల ఆశీస్సులు ఉంటాయి’’అని మోదీ చెప్పుకొచ్చారు. భాజపా ప్రభుత్వంలో దళితులు, వెనుకబడిన తరగతులు, పేదలు, మహిళలు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరూ ఏదో ఒక పథకం ద్వారా లబ్ధిపొందారని మోదీ గుర్తుచేశారు. అందుకే యూపీ రాష్ట్రం మరోసారి యోగి ప్రభుత్వాన్నే కోరుకుంటోందని మోదీ తెలిపారు.  

ఇటీవల తన కలలో శ్రీకృష్ణుడి కనిపించాడని, తామే ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నట్లు కృష్ణుడు చెప్పాడని సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వెల్లడించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధాని మోదీ తాజాగా స్పందించారు. రాష్ట్రంలో భాజపాకు లభిస్తున్న మద్దతు చూసి కొందరికి కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తున్నాడని ఎద్దేవా చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని