Angallu case: ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. అంగళ్లు కేసులో జోక్యానికి సుప్రీం నిరాకరణ

అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది.

Updated : 03 Oct 2023 14:00 IST

దిల్లీ: అంగళ్లు కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ఘటనలో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఆరు వేర్వేరు పిటిషన్లను జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం కొట్టివేసింది. ఈ కేసులో తెదేపా నేతలకు హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు సమర్థించింది.

‘సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి’ పేరిట ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అంగళ్లు మీదుగా ఆయన వెళుతున్నప్పుడు వైకాపా శ్రేణులు కవ్వింపు చర్యలకు పాల్పడడం, తెదేపా కార్యకర్తలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో తెదేపా అధినేత చంద్రబాబు సహా ఆ పార్టీకి చెందిన మొత్తం 179 మంది నేతలపై కురబలకోట మండలం ముదివేడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలువురు తెదేపా నేతలను అరెస్ట్‌ చేశారు. దీనిపై వారు హైకోర్టును ఆశ్రయించగా.. విచారణ అనంతరం కొందరికి బెయిల్‌ లభించింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆరు వేర్వేరు పిటిషన్లను దాఖలు చేసింది. తెదేపా నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, చల్లా రామచంద్రారెడ్డి అలియాస్‌ బాబు, నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డిలకు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని కోరింది. చల్లా బాబుకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం నాలుగు పిటిషన్లు దాఖలు చేసింది. 

పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. పోలీసులే సాక్షులుగా ఉంటారా?

విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పిటిషన్‌పై జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్ బేలా ఎం త్రివేది ధర్మాసనం పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఘటన జరిగిన నాలుగు రోజుల తర్వాత ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడంపై అభ్యంతరం తెలిపింది. పోలీసు అధికారులు గాయపడ్డారని.. ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారుగా ఉన్నారని ఏపీ ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. స్పందించిన ధర్మాసనం.. భద్రత కల్పించే పోలీసులే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి.. వారే సాక్షులుగా ఉంటారా? అని ప్రశ్నించింది. హైకోర్టు బెయిల్‌ ఇచ్చినందున దీనిలో జోక్యం చేసుకోవడానికి ఏమీ లేదని స్పష్టం చేసింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసి ఆరు వేర్వేరు పిటిషన్లను కొట్టివేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని