West Bengal: అమిత్‌ షాతో సువేందు అధికారి భేటీ

బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన అంశాలను అమిత్‌ షాతో చర్చించారు.

Published : 09 Jun 2021 01:35 IST

రేపు ప్రధానితో సమావేశం కానున్నట్లు సమాచారం

దిల్లీ: పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తైనప్పటికీ రాజకీయం వాతావరణం వాడీవేడీగా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎన్నికల తర్వాత చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలపై భాజపా, తృణమూల్‌ కాంగ్రెస్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడులకు సంబంధించిన అంశాలను అమిత్‌ షాతో చర్చించారు. రెండు రోజుల పాటు దిల్లీలోనే ఉండనున్న అధికారి, పలువురు కేంద్ర మంత్రులను కలువనున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని కూడా సువేందు అధికారి బుధవారం నాడు కలువనున్నట్లు సమాచారం. బెంగాల్‌లో శాంతి భద్రతలు ఆందోళనకరంగా ఉన్నాయని గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌ పేర్కొన్న నేపథ్యంలో.. సువేందు అధికారి దిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

‘బెంగాల్‌లో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు అనేక విషయాలపై కేంద్రమంత్రి అమిత్‌ షాతో చర్చించాను. ఈ సందర్భంగా బెంగాల్‌ సంక్షేమం కోసం తానెప్పుడూ సహకరిస్తామని హామీ ఇచ్చారు’ అని సువేందు అధికారి పేర్కొన్నారు.

పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం చోటుచేసుకున్న హింసాత్మక ఘటనల్లో పలువురు భాజపా కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయినట్లు భాజపా ఆరోపిస్తోంది. వీటిపై రాష్ట్ర గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కడ్‌కు భాజపా రాష్ట్ర కార్యవర్గం ఫిర్యాదు చేసింది. తాజాగా ఈ అంశాలను కేంద్ర హోంశాఖతోపాటు ప్రధాని దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది. అయితే, తమ కార్యకర్తలపై టీఎంసీ నేతలు దాడి చేశారంటూ భాజపా చేస్తోన్న ఆరోపణలను తృణమూల్‌ కొట్టిపారేస్తోంది. ఇదిలాఉండగా, బెంగాల్‌లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై ఇప్పటికే దృష్టిసారించిన కేంద్ర ప్రభుత్వం, దాడుల ఘటనపై గవర్నర్‌ నుంచి నివేదికలు తెప్పించుకున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని