Punjab election Result: సీఎంను ఓడించిన స్వీపర్‌ కుమారుడు..!

పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. ‘చీపురు’ తుపానుకు కాంగ్రెస్‌ పార్టీలోని దిగ్గజ నేతలందరూ కొట్టుకుపోయారు

Updated : 11 Mar 2022 14:53 IST

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ అఖండ విజయం సాధించింది. మొత్తం 117 అసెంబ్లీ స్థానాలకు గానూ ఏకంగా 92 స్థానాలను కొల్లగొట్టింది. ‘చీపురు’ తుపానుకు కాంగ్రెస్‌ పార్టీలోని దిగ్గజ నేతలందరూ కొట్టుకుపోయారు. ఏకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు సహా అనేక మంది హేమాహేమీలకు ఓటమి తప్పలేదు. సీఎం చరణ్‌జీత్‌ సింగ్ చన్నీని రెండు చోట్లా విజయం వరించలేదు. రెండు స్థానాల్లోనూ ఆప్‌ అభ్యర్థుల చేతుల్లోనే ఆయన ఓటమిపాలయ్యారు. చన్నీని ఓడించిన వారిలో ఒకరు స్వీపర్‌ కుమారుడు కావడం గమనార్హం.  

‘సామాన్యుడి’ చేతిలో..

ఈ ఎన్నికల్లో చన్నీ తన సొంత నియోజకవర్గమైన చామ్‌కౌర్‌ సాహిబ్‌తో పాటు బదౌర్‌ నుంచి కూడా పోటీ చేశారు. బదౌర్‌ స్థానంలో ఆప్‌ అభ్యర్థి లబ్‌సింగ్‌ ఉగోక్‌ చేతిలో 37,558 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 35 ఏళ్ల ఉగోక్‌.. అత్యంత సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఎన్నికల ముందు వరకు ఆయన ఓ మొబైల్‌ రిపేర్‌ షాప్‌ను నిర్వహించేవారు. ఆయన తండ్రి డ్రైవర్‌ కాగా.. తల్లి ఓ ప్రభుత్వ పాఠశాలలో స్వీపర్‌గా పనిచేస్తున్నారు. ఉగోక్‌ 12వ తరగతి వరకు చదువుకున్నారు. నామినేషన్‌ పత్రాల ప్రకారం.. ఆయన ఆస్తులు రూ.4.1లక్షలు మాత్రమే. 2013లో ఆమ్‌ ఆద్మీ పార్టీలో వాలంటీర్‌గా చేరారు. ఆ తర్వాత కార్యకర్తగా ఎదిగి నేడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు.

చన్నీని ఓడించిన చరణ్‌జీత్‌..

ఇక తన సొంత నియోజకవర్గమైన చామ్‌కౌర్‌ సాహిబ్‌లోనూ చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ స్థానంలోనూ ఆమ్‌ ఆద్మీ అభ్యర్థి చేతిలో 7,492 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. మరో విషయమేంటంటే.. చన్నీని ఓడించిన అభ్యర్థి పేరు కూడా చరణ్‌జీత్‌ సింగే. ఆప్‌ అభ్యర్థి అయిన డాక్టర్‌ చరణ్‌జీత్‌ నేత్ర వైద్యులుగా పనిచేస్తున్నారు. అంధులకు చూపు అందించేందుకు ఆయన చేసిన సేవలతో మంచిపేరు తెచ్చుకున్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేసిన డా.చరణ్‌జీత్‌.. చన్నీ చేతిలో 12వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ మరోసారి ఆయనకే టికెట్‌ ఇచ్చింది. గురువారం వెలువడిన ఫలితాల్లో సీఎంపై చరణ్‌జీత్‌ విజయం సాధించి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 

ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ కూడా ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అమృత్‌సర్‌ తూర్పు నుంచి పోటీ చేసిన ఆయన ఆప్‌ అభ్యర్థి జీవన్‌జోత్‌ కౌర్‌ చేతిలో 6,591 ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. జీవన్‌జోత్‌ కౌర్‌ ఓ సామాజిక కార్యకర్త. ప్యాడ్‌ వుమన్‌గా స్థానికంగా పేరొందారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ పాటియాలాలో, రాజకీయ కురువృద్ధుడు ప్రకాశ్ సింగ్ బాదల్‌ లంబిలో ఆప్‌ అభ్యర్థుల చేతుల్లో ఓటమి పాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని