Rahul Gandhi: కొవిడ్‌ కేసులు పెరుగుతున్నాయ్‌.. సేల్స్‌లో కేంద్రం బిజీ.. మీరు జాగ్రత్త సుమా!

కేంద్ర ప్రభుత్వం ఆస్తుల విక్రయాల్లో బిజీగా ఉందని విమర్శించిన రాహుల్‌.. ప్రజలే తామంతట తాముగా కొవిడ్‌ నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Published : 28 Aug 2021 02:12 IST

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శలు 

దిల్లీ: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడంపై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆందోళన వ్యక్తంచేశారు. ఈ మేరకు కేంద్రం తీరుపై మరోసారి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఆస్తుల విక్రయాల్లో బిజీగా ఉందని విమర్శించిన రాహుల్‌.. ప్రజలే తామంతట తాముగా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల ప్రకటించిన నేషనల్‌ మానిటైజేషన్‌ పైపులైన్‌ ప్లాన్‌ పట్ల రాహుల్‌ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. గత 70 ఏళ్లలో దేశం సృష్టించిన ఆస్తులను భాజపా సర్కార్‌ అమ్మేస్తోందంటూ ధ్వజమెత్తారు. కీలక రంగాల్లో గుత్తాధిపత్యం, ఉద్యోగాలను నాశనం చేయడమే లక్ష్యంగా ఆ ప్రణాళిక ఉందంటూ విమర్శలు గుప్పించారు. తమ పార్టీ ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదనీ.. హేతుబద్ధతలేని ప్రైవేటీకరణకు మాత్రం తాము వ్యతిరేకమన్నారు. తమ ప్రభుత్వ హయాంలో వ్యూహాత్మక రంగాలను ప్రైవేటీకరించలేదన్నారు. 

‘‘దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటం కలవరపెడుతోంది. మరో విజృంభణ తీవ్రతకు అడ్డుకట్టవేసేలా వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. ప్రజలు తమంతట తామే జాగ్రత్తలు తీసుకోవాలి..  ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం విక్రయాల్లో తీరికలేకుండా ఉంది’’ అని ట్విటర్‌లో విమర్శించారు. 

మరోవైపు, గత కొంత కాలంగా స్థిరంగా నమోదవుతూ వస్తున్న కొవిడ్‌ కేసులు తాజాగా ఒక్కసారిగా పెరిగాయి. గడిచిన 24గంటల వ్యవధిలో దేశ వ్యాప్తంగా 46,164 కేసులు, 607 మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో ఇప్పటివరకు నమోదైన పాజిటివ్‌ కేసులు 3,25,58,530కి చేరగా.. మరణాల సంఖ్య 4,36,365కి పెరిగింది. దేశంలో ప్రస్తుతం 3,33,725 క్రియాశీల కేసులు ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని