Telangana News: మోదీ సర్కారును కూకటివేళ్లతో కూల్చేస్తే తప్ప బుద్ధిరాదు: తలసాని

స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వం తీసుకున్న రైతు సానుకూల విధానాల ద్వారా ఊహించని స్థాయిలో ధాన్యం దిగుబడులు వస్తుంటే..

Updated : 24 Mar 2022 16:15 IST

హైదరాబాద్: స్వరాష్ట్ర సాధన తర్వాత ప్రభుత్వం తీసుకున్న రైతు సానుకూల విధానాల ద్వారా ఊహించని స్థాయిలో ధాన్యం దిగుబడులు వస్తుంటే.. సేకరణ విషయంలో కేంద్రం వైఖరి సరిగాలేదని రాష్ట్ర పశుసంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఆరోపించారు. పెరిగిన పెట్రోలు, డీజిల్, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బేగంపేట చీఫ్ రేషనింగ్ ఆఫీసర్ కార్యాలయం ఎదుట తెరాస ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, హోం శాఖ మంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరులు పాల్గొన్నారు. తెరాస నాయకులు, పలువురు కార్పొరేటర్లు, పార్టీ శ్రేణులు ఈ ధర్నాకు తరలివచ్చారు. ప్రధాని మోదీ అవలంబిస్తోన్న విధానాలను వ్యతిరేకిస్తూ రోడ్డుపైనే వంట చేసి నిరసన వ్యక్తం చేశారు.

తలసాని మాట్లాడుతూ.. ‘‘చట్టం, రాజ్యాంగ పరంగా ఎఫ్‌సీఐ ధాన్యం కొనాల్సి ఉన్నప్పటికీ... మేం కొనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం మొండిగా ప్రవర్తిస్తోంది. మతాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్న మోదీ సర్కారును కూకటివేళ్లతో కూల్చేస్తే తప్ప బుద్ధిరాదు. కొవిడ్ నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థ కుదేలై నిరుద్యోగం పెరిగిపోయింది. ఏపీలో విశాఖ ఉక్కు, తెలంగాణలో సింగరేణి ప్రభుత్వ సంస్థల అమ్మకానికి పూనుకున్న కేంద్ర ప్రభుత్వ చర్యలను తిప్పికొట్టాలి. అంబానీ, అదానీలకే ప్రభుత్వ రంగ సంస్థలను కట్టబెడుతూ దేశ సంపద దోచుకోవడానికి కేంద్రం బాటలు వేస్తోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికలు పూర్తైన వెంటనే ఎడాపెడా పెట్రోలు, డీజిల్‌, గ్యాస్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచేసి సామాన్యుల నడ్డి విరిచేస్తోంది’’ అని తలసాని మండిపడ్డారు.

కవిత మాట్లాడుతూ.. ‘‘2014 నుంచి ఇప్పటిదాకా ధర్నాలు చేయాల్సిన అవసరం రాలేదు. మోదీ సర్కారు పుణ్యమా అని రైతాంగం, గిరిజనులు, ఇతర సమస్యలపై రోడ్డెక్కాల్సిన దుస్థితి వచ్చింది. పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న భాజపా రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పెట్రోలు, గ్యాస్ ధరలు తగ్గించేందుకు చొరవ చూపాలి. ఇకనైనా ప్రజా వ్యతిరేక విధానాల అమలు విషయంలో కేంద్రం వైఖరిలో మార్పు రాకపోయినా, పంజాబ్‌ తరహాలో ధాన్యం కొనకపోయినా.. భాజపాను ఇంటికి పంపడం ఖాయం’’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని