ఓటు కోసం కోటి పాట్లు

కూటి కోసం కోటి పాట్లు అన్న చందంగా ఓటు కోసం కోటి పాట్లు పడుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో తమిళనాడులో...

Updated : 26 Mar 2021 15:18 IST

ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థుల నానా తిప్పలు

చెన్నై: కూటి కోసం కోటి పాట్లు అన్న చందంగా ఓటు కోసం కోటి పాట్లు పడుతున్నాయి తమిళ రాజకీయ పార్టీలు. ఓటర్లను ఆకర్షించేందుకు నేతలు నానా తంటాలు పడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి మరికొద్ది రోజులు మాత్రమే గడువు ఉండటంతో తమిళనాడులో అన్ని పార్టీల నేతలు ప్రచార జోరు పెంచారు. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ నేతల విన్యాసాలు ప్రజలను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రచారంలో భాగంగా కొందరు అభ్యర్థులు దోశలు వేయడం, ఇస్త్రీ చేయడం, కూరగాయలు అమ్మడం, పెద్దల కాళ్లు కడగడం వంటివి చేస్తున్నారు. ఇక మరికొందరేమో బట్టలు ఉతకడం దగ్గరి నుంచి పిల్లలకు స్నానాలు చేయించడం వరకు అన్ని పనులు చేస్తూ తమలో ఒకరు అనే భావనను ప్రజలకు కలిగించేందుకు ప్రయత్నిస్తున్నారు.

దోశలు వేస్తారు.. బట్టలు ఉతుకుతారు..

చెన్నైలోని విరుంగబక్కం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ప్రభాకర్‌ రాజా దోశలు వేశారు. మరి ఆయన దోశలు రుచికరంగా వేసినప్పటికీ ప్రజలు ఆయనకు ఓట్లను టిప్‌గా చెల్లిస్తారా అన్నది వేచిచూడాల్సిందే. మరికొంతమంది అభ్యర్థులు శుభ్రం చేయడానికే రాజకీయాల్లోకి వచ్చామని సందేశమిచ్చారు. అయితే అది సమాజాన్నా.. లేదా ఓటర్ల వస్త్రాలా.. అన్నది అర్థం కాని పరిస్థితి. నాగపట్టణం అన్నాడీఎంకే అభ్యర్థి కతివరన్‌ ప్రచారం చేస్తుండగా.. ఓ మహిళ బట్టలుతుకుతూ కనిపించారు. ఇంకేముంది వెంటనే కతివరన్‌ రంగంలోకి దూకి బట్టలు ఉతికేశారు. మరి తమ పార్టీ వాషింగ్‌ మెషిన్‌ ఇస్తామని హామీ ఇచ్చిన సంగతి ఆయనకు గుర్తుందో లేదో?..

చెత్త కుప్ప వద్ద కూర్చొని ప్రచారం

చెన్నైలోని తిరువోత్తియర్‌ స్థానం నుంచి బరిలో ఉన్న డీఎంకే అభ్యర్థి కేపీ శంకర్‌ ఏకంగా బాక్సింగ్‌ చేశారు. ఎదుట ఉన్న వ్యక్తి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి అనుకొని పంచులు విసిరారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు బరిలో ఉంటే ఆ హంగామా వేరుగా ఉంటుంది. తొండముత్తూర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న కోలీవుడ్‌ నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ డిఫరెంట్‌గా ప్రచారం నిర్వహిస్తూ దృష్టిని తనవైపు తిప్పుకొంటున్నారు. పెన్నూ, పేపర్‌ చేతబట్టి ప్రజల సమస్యలు రాసుకుంటున్నారు. ఏకంగా చెత్త కుప్ప వద్ద కూర్చొని మరీ ప్రచారం నిర్వహిస్తున్నారు. కొందరు కబడ్డీ ఆడితే మరికొందరు డమరుకం వాయిస్తూ ఓట్లు అడుగుతున్నారు. మరో అభ్యర్థి బ్యాట్స్‌మెన్‌ వేషం వేసి సమస్యలను బాదేస్తానంటూ వీధుల్లో తిరుగుతున్నారు.

మద్దతుదారుల హంగామానే వేరయా..

అభ్యర్థుల సంగతే ఇలా ఉంటే వారి మద్దతుదారుల గురించి చెప్పనవసరం లేదు. సందట్లో సడేమియాలా వారు చేసే హడావుడి మామూలుగా ఉండదు. ఆర్‌ఎస్‌పురం స్థానం నుంచి పోటీలో ఉన్న అన్నాడీఎంకే అభ్యర్థి, రాష్ట్ర మంత్రి ఎస్పీ వేలుమణికి మద్దతుగా ఓ యోగా టీచర్ తలకిందులుగా నడుస్తూ నడుముకు చైన్‌ కట్టుకొని కారును లాగారు. దీని వల్ల తన అభిమాన నేతకు ప్రచారంతోపాటు యోగాపై కూడా ప్రజల్లో అవగాహన కల్పించవచ్చని ఆయన అంటున్నారు. ఇలా అనేక వింతలు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేల ప్రజలకు దర్శనమిస్తున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని