Tamilsai: అమిత్‌ షాతో ‘సీరియస్‌ చర్చ’.. ఆ విషయం గురించే: తమిళిసై

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాతో జరిగిన సంభాషణపై తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టత ఇచ్చారు. 

Updated : 14 Jun 2024 07:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణస్వీకారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit Shah), తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ (Tamilisai Soundararajan) మధ్య సీరియస్‌గా సాగినట్లు కనిపించిన సన్నివేశం నెట్టింట వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీనిపై సామాజిక మాధ్యమాలతో పాటు మీడియాలోనూ తీవ్ర చర్చకు దారితీసింది. ఇద్దరు నేతలు ఏం మాట్లాడుకున్నారు? ఆ సమయంలో ఇంత సీరియస్‌ చర్చేంటి? అనే కోణంలో సామాజిక మాధ్యమాల్లో నెటిజన్ల మధ్య చర్చ జరిగింది. తమిళనాడులో భాజపా నేతల మధ్య అంతర్గత విభేదాల గురించే వీరి చర్చ సాగినట్లు పలువురు తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు.

ఈ ఘటనకు సంబంధించి తమిళిసై తాజాగా స్పందించారు. అమిత్‌ షాతో చర్చకు సంబంధించిన ఊహాగానాలను ఆమె కొట్టిపారేశారు. ఈ వీడియోను తప్పుగా అర్థం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు చేశారు. ‘‘లోక్‌సభ ఎన్నికలు ముగిసిన అనంతరం ఏపీలో జరిగిన కార్యక్రమంలో తొలిసారిగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిశాను. పోలింగ్‌ తర్వాత సమీకరణాలు, ఎన్నికల్లో నేను ఎదుర్కొన్న సవాళ్ల గురించి తెలుసుకునేందుకు అమిత్‌ షా నన్ను పిలిచారు. నేను ఆయనకు వివరిస్తున్నప్పుడు సమయాభావాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మాట్లాడారు. రాజకీయ, నియోజకవర్గ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టాలని సలహా ఇచ్చారు. ఆ మాటలు నాకు ఎంతో భరోసా కలిగించాయి. ఈ అంశం చుట్టూ తిరుగుతున్న అన్ని ఊహాగానాలకు ఇది స్పష్టత ఇస్తుంది’’ అని తమిళిసై పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని