రాష్ట్రపతిని కలిసిన తెదేపా ఎంపీల బృందం

అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం ఆరాచక పాలన చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు.

Updated : 16 Jul 2020 13:56 IST

దిల్లీ: అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం అరాచక పాలన చేస్తోందని తెలుగుదేశం పార్టీ ఎంపీలు రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల పరిరక్షణలో జోక్యం చేసుకోవాలని కోరారు. కనకమేడల రవీంద్రకుమార్‌, గల్లా జయదేవ్‌, రామ్మోహన్‌నాయుడు, కేశినేని నాని దిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలిశారు. అనంతరం ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ... తాము చెప్పిన విషయాలను రాష్ట్రపతి సావదానంగా విన్నారని, తన పరిధిలో తీసుకోగలిగే చర్యలను పరిశీలిస్తానని హామీ ఇచ్చినట్టు తెలిపారు. 

రాష్ట్రపతి భవన్‌ వద్ద కనక మేడల రవీంద్ర కుమార్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు, శాంతిభద్రతలకు సంబంధించిన అన్ని అంశాలు రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యాంగ సంస్థల విధ్వంసం, ప్రాథమిక హక్కులు హరించివేయటం. శాంతి భద్రతల పేరుతో ప్రత్యర్థులపై కేసులు పెట్టడం. తెదేపా నేతలను కేసుల్లో ఇరికించి ఇబ్బంది పెట్టడం. సోషల్‌ మీడియా పేరుతో ప్రజల గొంతు నొక్కేయడం. మూడు రాజధానుల ప్రతిపాదన తెచ్చి అమరావతిని చంపేయడం. ప్రభుత్వ పథకాల్లో జరుగుతున్న అవినీతిపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశాం’’. ఇప్పటికే కొన్ని విషయాలు రాష్ట్రపతి దృష్టిలో ఉన్నాయి, వీటిని కూడా పరిశీలిస్తామని చెప్పారని కనకమేడల వివరించారు.  


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని