Andhra News: ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. అక్కడికే వెళ్లిపోండి: అచ్చెన్నాయుడు

ఏపీలో మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు.

Updated : 07 Mar 2022 19:58 IST

అమరావతి: ఏపీలో మూడేళ్లుగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని తెదేపా ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. ఏపీలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ వ్యవస్థలపై దాడిని గవర్నర్‌ అడ్డుకోవడంలేదని ఆరోపిస్తూ తెదేపా సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. అనంతరం అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడారు.

‘‘రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతున్నా గవర్నర్‌ పట్టించుకోవట్లేదు. గవర్నర్‌ను అడ్డు పెట్టుకొని ప్రభుత్వం ఉల్లంఘనలకు పాల్పడింది. న్యాయవ్యవస్థపై దాడి జరిగినా గవర్నర్‌ స్పందించలేదు. గవర్నర్‌ పేరు మీద అప్పులు తీసుకున్నప్పుడూ పట్టించుకోలేదు. సీఆర్డీఏ చట్టాన్ని రద్దు చేస్తే.. గవర్నర్‌ స్పందించలేదు. సీఆర్డీఏ చట్టం ఎవరింట్లోనే తయారు చేసింది కాదు. సమస్యలను గవర్నర్‌ పట్టించుకోనందునే ప్రసంగం వినలేదు. అవాస్తవాలతో కూడిన ఆ ప్రసంగం మేము వినలేం. బీఏసీలో ప్రజా సమస్యలకు ప్రభుత్వం విలువ ఇవ్వలేదు. సమావేశంలో 30 అంశాలపై వాదించినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రసంగాన్ని బహిష్కరించినందుకు బీఏసీలో సీఎం ఆగ్రహించారు’’ అని అచ్చెన్నాయుడు అన్నారు.

రాజధానిపై మంత్రి బొత్స చేసిన వ్యాఖ్యలపై కూడా అచ్చెన్న స్పందించారు. ‘‘ఏపీ రాజధాని హైదరాబాదే అయితే.. అక్కడికే వెళ్లిపోండి. రాష్ట్రం నుంచి పాలించాలనే మేము ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు హైదరాబాదే రాజధాని అంటే ఏం చేయగలం?’’ అని అచ్చెన్నాయుడు అన్నారు. విభజన చట్టం ప్రకారం 2024 వరకు ఏపీ రాజధాని హైదరాబాద్‌ అని బొత్స అన్నారు. అమరావతి రాజధానిగా పార్లమెంట్‌ నుంచి ఆమోదం రాలేదని.. రాష్ట్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకుందని చెప్పారు. బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడిన బొత్స ఈ వ్యాఖ్యలు చేశారు.  



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని