Andhra News: రూ.3వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ఎక్కడ?: అచ్చెన్న

రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు.

Updated : 07 May 2022 10:16 IST

అమరావతి: రాష్ట్రంలో అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ సీఎం జగన్‌కు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు అకాల వర్షాలు మనోవేదనకు గురిచేశాయని తెలిపారు. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి, మిర్చి, మామిడి, నిమ్మ, సపోటాతో పాటు ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని లేఖలో పేర్కొన్నారు. మూడేళ్లుగా అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారన్నారు. ఓ వైపు గిట్టుబాటు ధరలు లేక.. మరోవైపు ప్రకృతి విపత్తులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిందని అచ్చెన్న ఆందోళన వ్యక్తం చేశారు.

రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి, రూ.4 వేల కోట్లతో ప్రకృతి విపత్తుల నిధి ఏర్పాటు మాటలకే పరిమితమైందని విమర్శించారు. గత మూడేళ్లలో 9 తుపాన్ల ధాటికి సుమారు 50 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దాదాపు రూ.20వేల కోట్ల పంట నష్టం జరగ్గా.. ప్రభుత్వం ఇచ్చిన పరిహారం 10 శాతం కూడా దాటలేదని ఆరోపించారు. ప్రకృతి విపత్తులతో నష్టపోయిన రైతులకు పరిహారం అందించి అన్నివిధాలా ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. తడిసిన, రంగుమారిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని లేఖలో అచ్చెన్న కోరారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని