Palla Srinivasa Rao: 100 రోజుల్లో తెదేపా కార్యకర్తలపై కేసుల ఎత్తివేతకు కృషి: పల్లా శ్రీనివాసరావు

వైకాపా పాలనలో తెదేపా కార్యకర్తలపై ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదు చేశారని, వాటిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపించి క్రిమినల్‌ కేసులు మినహా రాజకీయపరమైన వాటిని వంద రోజుల్లో ఎత్తివేసేలా పార్టీ తరఫున కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

Updated : 19 Jun 2024 08:28 IST

ప్రజాభిప్రాయాన్ని బట్టి రుషికొండ భవనాల వినియోగం
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు వెల్లడి

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు,
చిత్రంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, ఎంపీ శ్రీభరత్, తెదేపా విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు గండి బాబ్జీ

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: వైకాపా పాలనలో తెదేపా కార్యకర్తలపై ఇష్టమొచ్చినట్లు కేసులు నమోదు చేశారని, వాటిపై పూర్తి స్థాయిలో సమీక్ష జరిపించి క్రిమినల్‌ కేసులు మినహా రాజకీయపరమైన వాటిని వంద రోజుల్లో ఎత్తివేసేలా పార్టీ తరఫున కృషి చేస్తానని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. విశాఖలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘ప్రజాభిప్రాయానికి అనుగుణంగా రుషికొండ భవనాలను వినియోగిస్తాం. ఇప్పటికే దీనిపై సీఎం చంద్రబాబు దృష్టి సారించారు. ప్రజా రాజధాని అమరావతి నిర్మాణ పనులను వేగవంతం చేస్తాం. ఏడాది లోపు దీనికి ఒక రూపు వస్తుంది. పోలవరం ప్రాజెక్టును జగన్‌ ప్రభుత్వం నాశనం చేసింది. దాన్ని ఎలాగైనా పూర్తి చేసి రైతులకు అందజేయాలనే కృతనిశ్చయంతో సీఎం ఉన్నారు. విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. ఐటీతో పాటు ఇతర పరిశ్రమలు తెచ్చి యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు విశాఖ అగనంపూడి టోల్‌గేట్‌ను నెల రోజుల్లో ఎత్తివేస్తాం. విశాఖలోని దసపల్లా హిల్స్, సీబీసీఎన్‌సీ, హయగ్రీయ, ఎన్‌సీసీ తదితర భూములను వైకాపా పెద్దలు కొట్టేశారు. ఇప్పుడు వాటిని తిరిగి స్వాధీనం చేసుకొని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తాం. పార్టీలో కార్యకర్తలకు అగ్ర ప్రాధాన్యం ఉంటుంది. సభ్యత్వ నమోదును వేగవంతం చేయడంతోపాటు పార్టీని నమ్ముకుని కష్టపడ్డవారికి కచ్చితంగా పదవులు దక్కేలా చర్యలు తీసుకుంటాం. అమరావతి నుంచే అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తా. విశాఖ వచ్చి ఉత్తరాంధ్ర వ్యవహారాలను చూస్తా. అక్రమాలకు పాల్పడే వారిని పార్టీలో చేర్చుకోబోం. మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, వైకాపా నేత జి.వెంకటేశ్వర్లు వంటి వారికి అవకాశం ఇచ్చే ప్రసక్తే లేదు. చంద్రబాబు నా మీద నమ్ముకంతో కీలక పదవి అప్పజెప్పారు. ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను నెరవేర్చుతా. పార్టీకి, ప్రభుత్వానికి వారధిలా ఉండడంతోపాటు భాజపా, జనసేన పార్టీల నాయకులను కలుపుకొని ముందుకెళతా’ అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. విశాఖ ఎంపీ శ్రీభరత్, విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, పార్టీ విశాఖ లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గండి బాబ్జీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని