Kuppam: ప్రచార రథాన్ని అడ్డుకున్న పోలీసులు.. కుప్పంలో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ

తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు.

Updated : 04 Jan 2023 12:45 IST

కుప్పం పట్టణం: తెదేపా అధినేత చంద్రబాబు కాసేపట్లో కుప్పం చేరుకోనున్నారు. పర్యటనకు సంబంధించి తెదేపా నేతలు చేస్తున్న ఏర్పాట్లను పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. దీంతో చంద్రబాబు పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. హైదరాబాద్‌ నుంచి విమానంలో బయల్దేరిన చంద్రబాబు.. ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆయన రోడ్డు మార్గంలో కుప్పం వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు శాంతిపురం మండలం పెద్దూరు గ్రామానికి చంద్రబాబు చేరుకోనున్నారు. సాయంత్రం కేనుమాకురిపల్లిలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. 

మరోవైపు చంద్రబాబు పర్యటన కోసం కుప్పం నుంచి శాంతిపురం మండలానికి వెళ్లాల్సిన తెదేపా ప్రచార రథాన్ని, ఇతర వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. దీనిపై స్థానిక తెదేపా నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతిపురం మండలం పెద్దూరు, శివకురుబూరు గ్రామాల్లో నిర్వహించనున్న ‘ఇదేంఖర్మ రాష్ట్రానికి’ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ సందర్భంగా అక్కడ సభ ఏర్పాటు చేసే సభలో పాల్గొనేందుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నారు. చంద్రబాబు పర్యటన ఉండే మార్గాల్లో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయితే కొన్నిచోట్ల కార్యకర్తలను పోలీసులు అడ్డుకుని వారిని తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. పలు ప్రాంతాల్లో బారికేడ్లు పెట్టి కార్యకర్తలను నిలువరిస్తున్నారు.

కేనుమాకురిపల్లిలో చంద్రబాబు నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమానికి అనుమతి లేదని పోలీసుల చెప్పడంపై తెదేపా శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మంగళవారం అనుమతి ఇచ్చి బుధవారం లేదని చెప్పడం ఏంటని నేతలు మండిపడుతున్నారు. శాంతిపురంలో వందలాది మంది పోలీసులు మోహరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తు్నారు. చంద్రబాబు పర్యటనకు జనం రాకుండా చేసేందుకు పోలీసులు భయాందోళన కలిగించేలా ప్రవర్తిస్తున్నారని తెదేపా నాయకులు ఆరోపిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని