Chandrababu: మోసం చేయడంలో సీఎం జగన్‌ దిట్ట: చంద్రబాబు

 పల్నాడు జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను తెదేపా అధినేత చంద్రబాబు పరిశీలించారు. అనంతరం గురజాలలో కూడలిలో మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మోసం చేయడంలో సీఎం జగన్‌ దిట్ట అని అన్నారు. ఇంటిపన్ను, చెత్తపన్ను, నీటిపన్ను ఇలా అన్ని పన్నులూ పెంచారన్నారు. ఈ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని పేర్కొన్నారు.

Published : 20 Oct 2022 01:37 IST

పల్నాడు: మోసం చేయడంలో సీఎం జగన్‌ దిట్ట అని తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పల్నాడు జిల్లాలో వర్షాలతో దెబ్బతిన్న పంటలను పరిశీలించిన అనంతరం ఆయన గురజాలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. స్థానిక బ్రహ్మనాయుడు కూడలిలో  ఏర్పాటు చేసిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ..‘‘ రైతులు కష్టాల్లో ఉన్నారని తెలిసి మహానాడు వాయిదా వేసుకొని మీ వద్దకు వచ్చా. అసలు ఈ ప్రభుత్వం పని చేస్తుందా?భారీ వర్షాలతో పంట నష్టపోతే  ప్రభుత్వం నుంచి రైతుల వద్దకు ఎవరూ రాలేదు. మిర్చి రైతులు పూర్తిగా నష్టపోయారు. ఒక్కోరైతు రూ.2.45 లక్షల అప్పు చేశారు. మోసం చేయడంలో సీఎం జగన్‌ దిట్ట. ఇంటిపన్ను, చెత్తపన్ను, నీటిపన్ను.. ఇలా అన్ని పన్నులూ పెంచేశారు. ఈ ప్రభుత్వంలో ఒక్కరికీ ఉద్యోగం రాలేదు. మూడున్నర ఏళ్లలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. జాబు రావాలంటే బాబు రావాల్సిందే. అమ్మ ఒడి అబద్ధం, నాన్న బుడ్డి నిజం. మద్యం, ఇసుక, మైనింగ్‌ అన్నింటా స్కాములే. అమరావతి రైతులు పాదయాత్ర  చేస్తుంటే వైకాపా ఎంపీ దాడి చేస్తారు. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? లేదా?జనసేన కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి  అరెస్టు చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం అందరూ కలిసి రావాలని కోరా. వైఎస్‌ వివేకా కేసులో సునీతారెడ్డి  ధైర్యంగా పోరాడుతున్నారు. రాష్ట్ర పోలీసులు సీబీఐ అధికారులపై కేసులు పెట్టారు. అలాంటి అధికారులకు భవిష్యత్తులో తిప్పలు తప్పవు. పవన్‌ కల్యాణ్‌ ఎంతో క్షోభ అనుభవించినందునే  చెప్పు చూపారు. వైకాపా నేతల వేధింపులు భరించలేకే చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. రాష్ట్రంలో ఎవరికి అన్యాయం జరిగినా అండగా ఉంటాం. కొందరు మంత్రులు జగన్‌కు పెంపుడు కుక్కల్లా పని చేస్తున్నారు. అలాంటి వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు. 
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని